మంగళవారం రూపాయి భారీగా పతనమైంది. మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభం నుండి రూపాయి భారీగా పతనమైంది. డాలరుతో మారకపు విలువ రూ.70కి చేరిపోయింది. టర్కీ అధ్యక్షుడు అమెరికాతో వ్యాపార సంబంధాల మీద తీసుకుంటున్న నిర్ణయాల మీద అంతర్జాతీయ మార్కెట్లు ప్రభావానికి గురయ్యాయి. ఆ ప్రభావం మన కరెన్సీపైనా పడుతోంది. సోమవారం రూపాయి మారకం విలువ ఏకంగా 110 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం మరింతగా పడిపోయి రూ.70.08 పైసల వద్ద ఆల్టైమ్ కనిష్ఠానికి చేరింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి రూ.69.93 పైసల వద్ద స్థిరపడింది.
ఐదేళ్లలో ఈ స్థాయిలో రూపాయి క్షీణించడం ఇదే తొలిసారి కాగా.. యూఎస్ కరెన్సీ దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డిమాండ్ పెరగడంతో రూపాయి బలహీనపడుతోందని ట్రేడర్ల అంచనా.
టర్కీ ఆర్థిక సంక్షోభం ఆందోళనలతో నిన్న కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు.. నేడు సానుకూలంగా నడుస్తున్నాయి. కడపటి వార్తలందేసరికి సెన్సెక్స్ 184.93 పాయింట్లు బలపడి 37,829.83 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11402.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అల్ట్రాటెక్, గెయిల్, యాక్సిస్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ లాభాల్లో నడుస్తుండగా.. యూపీఎల్, టీసీఎస్, ఎల్ అండ్ టీ తదితర కంపెనీ షేర్లు నష్టపోయాయి.