ఆర్‌ఎస్‌ఎస్ ఓ కాలకూట విషం.. దానిని రుచిచూసిన వారికి దాని పర్యవసానాలు తెలుసు: మల్లిఖార్జున్ ఖర్గే

కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే.. రాహుల్ గాంధీకి హితవు పలుకుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Aug 30, 2018, 07:43 PM IST
ఆర్‌ఎస్‌ఎస్ ఓ కాలకూట విషం.. దానిని రుచిచూసిన వారికి దాని పర్యవసానాలు తెలుసు: మల్లిఖార్జున్ ఖర్గే

కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే.. రాహుల్ గాంధీకి హితవు పలుకుతూ పలు వ్యాఖ్యలు చేశారు. "ఆర్ఎస్ఎస్ దేశంతో పాటు సమాజానికి, దళితులకు విషపదార్థం లాంటిది. దాని రుచి చూసినవారికి బాగా దాని పర్యవసానాలు ఏమిటో తెలుసు" అని ఆయన తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ ఒకవేళ ఆహ్వానం పంపితే.. వారి సభకు హాజరుకావద్దని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్‌కి తెలిపారు. అందులో మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఒకరు. ఖర్గే మాట్లాడుతూ, ఆర్‌ఎస్ఎస్ తమ భావజాలాన్ని అందరికీ నూరిపోయాలని చూస్తుందని.. రాహుల్ అందుకు సమర్థించే కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉంటే మంచిదని ఆయన హితవు పలికారు.

ఆర్‌ఎస్ఎస్ నేతలు అప్పుడప్పుడు తమ సభలకు వేరే భావజాలానికి చెందిన వ్యక్తులను కూడా ఆహ్వానిస్తుంటారు. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తులు ఆర్‌ఎస్‌ఎస్ వేదికలపై ప్రసంగించారు. ప్రస్తుతం మోహన్ భగవత్ తమ సభలకు రాహుల్ గాంధీతో పాటు సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరిని కూడా ఆహ్వానించాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే రాహుల్ గాంధీ ఆర్‌ఎస్ఎస్‌ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చడం పై మండిపడిన విషయం తెలిసిందే. 

అయితే తమ సభలో ప్రసంగించే నిమిత్తం రాహుల్ గాంధీకి ఆర్‌ఎస్‌ఎస్ నుండి ఎలాంటి ఆహ్వానం కూడా రాలేదని కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది. అయితే ఒకవేళ ఆర్ఎస్ఎస్ నుండి ఆహ్వానం వస్తే కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందని పలువురు విలేకరులు సంధించిన ప్రశ్నకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఘాటుగా జవాబిచ్చారు. "ఊహాగానాలతో కూడుకున్న ప్రశ్నలకు మేము జవాబివ్వదలచుకోలేదు. ఒకవేళ మాకు ఆర్ఎస్ఎస్ నుండి ఆహ్వానం వస్తే.. దానికి ఏ విధమైన జవాబివ్వాలన్నది అప్పటి పరిస్థితుల బట్టి ఉంటుంది. అప్పుడు ఆ సమాధానాన్ని మీ అందరితో కూడా తప్పకుండా పంచుకోవడం జరుగుతుంది" అని తెలిపారు. 

Trending News