అనునిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే పెరుగుతూపోతే సామాన్యులకే కాదు.. దేశాభివద్ధికి సైతం తీరని నష్టమే అంటున్నారు ఇదే వ్యాపార రంగానికి చెందిన ఆర్థిక నిపుణులు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరచడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధి రేటుపై సైతం పెను ప్రభావం చూపించనున్నాయని ప్రభుత్వ రంగ చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థ ఘోష్ తెలిపారు. 2040కల్లా భారత్‌లో క్రూడ్ ఆయిల్ డిమాండ్ 500మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, అయితే, డిమాండ్‌కి తగినట్టుగా ధరలు ఇలాగే పెరిగితే, ఆర్థికంగా అభివృద్ధి రేటుని తీవ్రంగా దెబ్బతీస్తుందని పార్థ ఘోష్ వివరించారు.
2017 గణాంకాల ప్రకారం భారత్‌లో చమురు వినియోగం రోజుకు 4.7 మిలియన్ బ్యారెల్స్ కాగా 2040కల్లా దేశంలో చమురు డిమాండ్ రోజుకు 10 మిలియన్ బ్యారెల్స్కి చేరుతుందని ఘోష్ పలు అంచనాలను వెల్లడించారు.