బీజేపీ పాలనలో ప్రజలు నిరాశలో కూరుకుపోయారు: కాంగ్రెస్

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'జన ఆక్రోశ్ ర్యాలీ' బహిరంగ సభ జరిగింది.

Last Updated : Apr 30, 2018, 07:17 AM IST
బీజేపీ పాలనలో ప్రజలు నిరాశలో కూరుకుపోయారు: కాంగ్రెస్

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'జన ఆక్రోశ్ ర్యాలీ' బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పూర్వపు అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జరుగుతున్న భారీ బహిరంగ సభ ఇదే. ఈ ర్యాలీకి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రాల అధ్యక్షుడు, కార్యదర్శులు హాజరయ్యారు.

ఈ సభలో మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ బాణాలను ఎక్కుపెట్టింది. మోదీ పాలనలో ప్రజలు నిరాశలో కూరుకుపోయారని మాజీ ప్రధాని విమర్శించారు. ఎన్నికల హామీలను మోదీ సర్కార్ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఎన్డీఏ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. మోదీ సమాజాన్ని విడగొట్టేలా వ్యవహరిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని సోనియా గాంధీ తెలిపారు. మోదీ పాలనలో ఎటుచూసినా అవినీతే కనిపిస్తోందని అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళలపై, బాలికలపై అత్యాచారాలు పెరిగాయని.. ఉన్నావ్, కథువా ఘటనలను ప్రస్తావించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోదీది మాటల ప్రభుత్వమే కాని చేతల ప్రభుత్వం కాదన్నారు. అవినీతిపరులను పక్కన పెట్టుకుని, అబద్ధాలు చెబుతూ కూడా తాను సత్యసంధుడిని అన్నట్లు మాట్లాడతారని విమర్శించారు.  న్యాయవ్యవస్థలోని సంక్షోభంపై మోదీ మౌనానికి అర్ధమేమిటని ప్రశ్నించిన ఆయన మోదీ పాలన ఆర్ఎస్ఎస్‌ను తలపిస్తున్నదని పేర్కొన్నారు. మోదీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. అవినీతిపరులకు టికెట్లిచ్చిన ఘనత మోదీదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్వతంత్ర వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని, పార్లమెంటు సమావేశాలు సజవుగా జరగడం లేదని ఆరోపించిన రాహుల్..  2019లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని ఉద్ఘాటించారు.

Trending News