న్యూఢిల్లీ: ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం సిద్ధం చేశారు. సక్సెస్‌కు మారు పేరుగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ I-PACతో ఒప్పందం ఖరారైంది. ఈ నేపథ్యంలో త్వరలోనే జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో I-PAC ఆమ్ అద్మీ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తుంది. I-PACతో కలిసి ఢిల్లీ ఎన్నికల కోసం పని చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దీన్ని రీట్వీట్ చేసిన ఐ-ప్యాక్.. అరవింద్ కేజ్రీవాల్‌తో, ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది.
ప్రశాంత్ కిశోర్ ప్రత్యేకత...
I-PAC.. పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో నడుస్తోంది. 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోదీకి విజయం చేకూర్చేందుకు ప్రశాంత్ కిశోర్ తనవంతు సహకారం అందించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత 2015లో బీహార్‌లో జేడీయూ తరఫున ఎన్నికల వ్యూహాలు రచించారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి చేయూత అందించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పని చేశారు. అన్ని ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఫలించాయి.
ప్రస్తుతం I-PAC 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం... తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీతో ప్రశాంత్ కిశోర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐతే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌కు ఓ సారూప్యత ఉంది. ఈ ముగ్గురు పౌరసత్వ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రశాంత్ కిశోర్ ఓ అడుగు ముందుకేసి... పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సవరణలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని కోరారు. వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో పౌరసత్వ సవరణ బిల్లు, ఢిల్లీ వాయు కాలుష్యం, మహిళల భద్రత, ఢిల్లీకి రాష్ట్రహోదా డిమాండ్ వంటివి కీలకం కానున్నాయి.