నిఘా నీడలో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికలు చివరి విడత పోలింగ్

లోక్ సభ ఎన్నికలు చివరి విడత పోలింగ్ ప్రారంభం

Last Updated : May 19, 2019, 07:07 AM IST
నిఘా నీడలో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికలు చివరి విడత పోలింగ్

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కలిపి మొత్తం 59 లోక్ సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులుతీరారు. 59 స్థానాల్లో మొత్తం 918 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 10.1 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. పంజాబ్‌లో 13 లోక్ సభ స్థానాలు, ఉత్తర్ ప్రదేశ్‌లో 13 లోక్ సభ స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘడ్‌లో ఒక లోక్ సభ స్థానానికి నేడు పోలింగ్ జరగనుంది. గత ఆరు విడతల పోలింగ్‌లో హింస చోటుచేసుకున్న పశ్చిమ బెంగాల్‌లో ఈసారి హింసకు తావులేకుండా ఉండేందుకు ఇసి అన్ని చర్యలు తీసుకుంది. కోల్‌కతా హింసను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కలిపి 710 కంపెనీల భద్రతా బలగాలను ఇసి మొహరించింది.

ఇప్పటి వరకు గడిచిన ఆరు విడతల పోలింగ్‌లో 483 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా చివరి విడత ఎన్నికలతో 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ స్థానాలకు కలిపి మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Trending News