జనసేవే ప్రభుసేవ: భారత ప్రధాని

  

Last Updated : Oct 20, 2017, 11:47 AM IST
జనసేవే ప్రభుసేవ: భారత ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదారినాథ్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మరియు గవర్నర్ కెకె పాల్ మోడీని సగౌరవంగా ఆహ్వానించారు. మోడీ రాకను పురస్కరించుకొని కేదారినాథ్‌లో నిర్వహిస్తున్న సభకు దాదాపు 4000 మంది హాజరవుతారని అంచనా. పలు ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇక్కడకు విచ్చేసిన ప్రధాని  ఆదిగురు శంకరాచార్యుని సమాధిని పునర్నిర్మించడం కోసం నెలకొల్పిన పునాదిరాయికి శంకుస్థాపన చేస్తారు. 2013లో ఈ సమాధి జలప్రళయం వలన దెబ్బతింది. అలాగే అక్కడే సెక్యూరిటీ వాల్ మరియు మ్యూజియం పునర్నిర్మించడం కోసం శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. 

మోడీ రాకను పురస్కరించుకొని కేదారినాథ్ ప్రాంతంలోని దేవాలయాలను దీపాలతో అలంకరించారు. పుష్పాలతో కూడిన తోరణాలు కట్టి ఆహ్వానం పలికారు.ఈ రోజు ఉదయం దేశ రాజధాని నుంచి విమానంలో జలీగ్రాంట్‌ విమానాశ్రయానికి చేరుకున్న మోడీ.. అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ వెళ్లారు. ప్రధాని  కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. ఇదే సంవత్సరం మే 3వ తేదీన జరిగిన ఆలయ పునఃప్రారంభ వేడుకలకు ఆయన హాజరయ్యారు. వాతావరణ స్థితిగతుల వలన కేదారినాథ్‌‌కు శీతాకాలంలో వెళ్లే అవకాశం ఉండదు. దాదాపు ఆరు నెలలు ఆ ఆలయాన్ని మూసి ఉంచుతారు. కేదరినాథ్ ఆలయాన్ని సందర్శించిన మోడీ శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేక వేడుకలో పాలుపంచుకున్నారు. దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్‌లో శ్రీకారం చుట్టనున్నారు మోడీ. 

ఈ పర్యటనలో భాగంగా కేదారిపురి టౌన్ షిప్‌ను ప్రారంభించారు మోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "జనసేవే ప్రభుసేవ. ఇక్కడికొచ్చి దాదాపు 1.15 కోట్ల మంది సాధుసన్యాసులను సేవించుకోవడం నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. భారతదేశ వికాసానికి నావంతు బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చేందుకు అవసరమైన మనోనిబ్బరాన్ని ప్రసాదించాల్సిందిగా ఆ భోళేనాధుడిని మనసారా కోరుకుంటున్నాను. 2022 నాటికి,అనగా మనం 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనేసరికి మన దేశం పూర్తిగా అభివృద్ధి చెందేలా నేను కృషిచేస్తానని తెలియజేసుకుంటున్నాను"అన్నారు. 

 

Trending News