లీటర్‌కి రూ.4 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలు రాబోతున్నాయి

Last Updated : May 18, 2018, 09:49 AM IST
లీటర్‌కి రూ.4 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

కర్ణాటకలో నాటకీయ పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓవైపు పతాక శీర్షికలకు ఎక్కుతుండగానే మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా రూ.4 వరకు పెరిగే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకన్నా ముందు నుంచే పెట్రోల్, డీజిల్ ధరలను ఏరోజుకు ఆరోజు సమీక్షించడం నిలిపేసిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత మరుసటి రెండు రోజుల నుంచే మళ్లీ పాత పద్ధతి అవలంభించడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 19 రోజుల తర్వాత గత సోమవారం నుంచి మళ్లీ పాత పద్ధతిలో ధరలను రోజువారీగా సమీక్షించడం మొదలుపెట్టాయి. 

సోమవారం నుంచి మొదలుకుని నేటి గురువారం వరకు మారిన ధరలు కలుపుకుని పెట్రోల్ లీటర్‌కి 69 పైసలు పెరగ్గా.. డీజిల్ లీటర్‌కి 86 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో కలుపుకుని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.32కు చేరుకుంది. గడిచిన ఐదేళ్లలో ఇదే అత్యధికం. ఇక డీజిల్ విషయానికొస్తే, ఢిల్లీలో ఇంతకు ముందెప్పుడూ లేనంతగా లీటర్ డీజిల్ ధర రూ.66.79 కి చేరుకుంది. 

ఇదిలావుంటే, రానున్న కొద్ది వారాల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధర లీటర్‌కి రూ.4 నుంచి రూ. 4.50, డీజిల్ ధర లీటర్‌కి రూ.3.5 నుంటి రూ. 4 వరకు పెంచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్టు కొటక్ ఇనిస్టిట్యుషనల్ ఈక్విటిస్ ఓ తాజా నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వున్న ధరలు, విదేశీ మారక ద్రవ్యం విలువ ప్రకారమే ఈ ధరల పెరుగుదల వుంటుందని కొటక్ ఇనిస్టిట్యుషనల్ ఈక్విటిస్ స్పష్టంచేసింది. ఒకవేళ అదే కానీ జరిగితే, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం కొండెక్కి కూర్చోవడమే కాకుండా.. డీజిల్ ధర పెరుగుదల కారణంగా మార్కెట్‌లో నిత్యవసరాల ధరలు సైతం అంతే అమాంతంగా పెరిగే ప్రమాదం లేకపోలేదు.  

Trending News