BJP Parliamentary Board: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీలో ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలే 2024 ఎన్నికలకు పని చేయనున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ చేసిన బీజేపీ.. పాత కమిటీని ప్రక్షాళన చేసింది. పార్లమెంటరీ కొత్త బోర్డులో 11 మందికి, కేంద్ర ఎన్నికల కమిటీలో 15 మందికి చోటు కల్పించింది. పార్లమెంటరీ బోర్డులో ముగ్గురు కొత్త నేతలకు చోటు దక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని పార్లమెంటరీ బోర్డులో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, జాతీయ కార్యదర్శి సుధా యాదవ్ ,లోక్‌సభ మాజీ ఎంపీ సత్యనారాయణ జతియా , కేఎల్ సంతోష్ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న కె.లక్ష్మణ్ కు చోటు దక్కింది. పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తప్పించారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను తొలగించడం ఆసక్తిగా మారింది. నితిన్ గడ్కరీ బీజేపీలో అత్యంత సీనియర్. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లకు పైగా పని చేశారు. వీళ్లద్దరి విషయంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. నరేంద్ర మోడీ తర్వాత బీజేపీలో ప్రధాని రేసులో వినిపిస్తున్న నేతల్లో నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ముందున్నారు. మోడీ తర్వాత గడ్కరే ప్రధానమంత్రి అవుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. నరేంద్ర మోడీపై ప్రజా వ్యతిరేకత పెరిగినందున అతన్ని మార్చి.. నితిన్ గడ్కరీని ప్రధానిని చేయాలని ఆరెస్సెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారనే వార్తలు గతంలో వచ్చాయి. నితిన్ గడ్కరీకి మొదటి నుంచి ఆరెస్సెస్ పెద్దల ఆశిస్సులు ఉన్నాయంటారు. 2019లోనే బీజేపీకి పూర్తి మెజార్టీ రాకుంటే మోడీ కాకుండా గడ్కరీ ప్రధాని అవుతారనే చర్చ దేశ రాజకీయ వర్గాల్లో సాగింది. ఎన్డీఏ పక్షాలకు చెందిన పార్టీల నేతలైన నితీశ్ కుమార్, చంద్రబాబు వంటి నేతలు మోడీ కంటే గడ్కరీకే సపోర్ట్ చేశారనే టాక్ ఉంది. కాని 2019లో బీజేపీకి మెజర్టీకి మించి సీట్లు రావడంతో మోడీకే ఎదురేలేకుండా పోయింది.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్‌పుర, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా , కేఎల్ సంతోష్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ , కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్, ఓమ్ మథుర్, వనతి శ్రీనివాస్‌కు చోటు కల్పించారు. పార్లమెంటరీ బోర్డుతో పాటు ఎన్నికల కమిటీలోనూ లక్ష్మణ్ కు చోటు దక్కింది. మోడీ, నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ రెండు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డును సామాజిక మరియు ప్రాంతీయ కోణంలో ఏర్పాటు చేశారని తెలుస్తోంది. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిగా పార్టీ పార్లమెంటరీ బోర్డులో మొదటిసారిగా సిక్కు వర్గానికి చెందిన లాల్‌పురాకు స్థానం దక్కింది. కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్, జువల్ ఓరాన్‌లను ఎన్నికల కమిటి నుంచి తొలగించారు.
ఇక బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన నేతలకు పార్లమెంటరీ బోర్డులో అవకాశం కల్పిస్తారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ గతంలో బీజేపీ చీఫ్ లు గా పనిచేశారు. కాని నితిన్ గడ్కరీ విషయంలో ఆ సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా సంఘ్ పరివార్ ఆశిస్సులు ఉన్ననేతే. నరేంద్ర మోడీ తర్వాత గడ్కరీ లేదా శివరాజ్ సింగ్ చౌహాన్ లలో ఒకరే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని బీజేపీ వర్గాల్లో కూడా ప్రచారం ఉంది. బీజేపీ తాజాగా ప్రకటించిన పార్లమెంటరీ బోర్డులో నరేంద్ర మోడీకి ప్రధానమంత్రిగా పోటీ దారులుగా ఉన్న ఇద్దరు సీనియర్ నేతలకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ పేరు కూడా బీజేపీ పీఎం అభ్యర్థి రేసులో కొంత కాలంగా వినిపిస్తోంది. యూపీలో చరిత్రను తిరగరాస్తూ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు యోగీ. తన పాలనలో హిందూ సంఘాల్లో హీరోగా నిలిచారు. దీంతో 2024లో ప్రధానమంత్రిగా మోడీకి యోగీ పోటీ వస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. కాని తాజాగా నియమించిన పార్లమెంటరీ బోర్డులో యోగీకి చోటు దక్కలేదు. పార్లమెంటరీ బోర్డులోనే చోటు దక్కని నేత ప్రధాని రేసులో ఉండటం కష్టమే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీ కూర్పులో నరేంద్ర మోడీ, అమిత్ షా ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.
2024లో జరగనునన్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మూడోసారి నరేంద్ర మోడీనే ప్రధానిగా ఉంటారనే సంకేతం ఇవ్వడానికే బోర్డులో గడ్కరీ, శివరాజ్ సింగ్, యోగీ ఆధిత్యనాథ్ కు అవకాశం కల్పించలేదనే ప్రచారం సాగుతోంది. తాజా కమిటీల ద్వారా బీజేపీలో నరేంద్ర మోడీకి మూడోసారి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. ఇటీవలే ఓ సభలో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. 2024 తర్వాత కూడా నరేంద్ర మోడీనే దేశ ప్రధానిగా ఉంటారని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన పార్లమెంటరీ బోర్డు ద్వారా బీజేపీ హైకమాండ్ అదే సిగ్నల్ ఇచ్చిందనే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Read Also: AP Floods: ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, కృష్ణమ్మ..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్..!
Read Also: Ktr Tweet: గుజరాత్‌లో 11 మంది రేపిస్టులను రిలీజ్.. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook