Nitin Gadkari About Petrol Prices: భారీగా పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరల గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్ గడ్కరి వ్యాఖ్యలను పరిశీలించడానికంటే ముందుగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ఒక లుక్కేసినట్టయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఒకప్పుడు లీటర్ పెట్రోల్ ధర మొదటిసారిగా రూ. 80 లేదా రూ. 90 మార్క్ తాకినప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ఆ తరువాత రూ. 100 మార్క్ తాకినప్పుడు రికార్డ్ ధరకు చేరిన ఇంధనం ధరలు అంటూ వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 110 మార్క్ వద్ద తచ్చాడుతోంది.
ఇలా అడ్డూఅదుపులేకుండా పెరిగిపోతున్న ఇంధనం ధరలు సామాన్య వాహనదారులను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాహనం ఇంట్లోంచి తీయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి తలెత్తింది. ఒకటో తారీఖు కోసం వేచిచూసే బడుగు జీవులంతా వీలైనంతవరకు వాహనం తీయకుండా ఆర్టీసీ బస్సు లేదా మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నారు. ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితేనే సొంత వాహనం బయటికి తీస్తున్నారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి చేసిన పలు కీలక వ్యాఖ్యలకు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇంతకీ నితిన్ గడ్కరీ ఏమన్నారంటే..
దేశంలో రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు ఒక్కో లీటర్‌కి రూ. 15 లకు తగ్గే అవకాశం ఉంటుందని... కానీ అంతకంటే ముందుగా వాహనదారులు పెట్రోల్‌పై అధికంగా ఆధారపడటం తగ్గించి, ఎలక్ట్రిక్, ఇథేనాల్ ఇంధనం ఆధారిత వాహనాలు వినియోగించడం పెరగాలి అని అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. వాహనాల కోసం పెట్రోల్ ఇంధనం పై ఆధారపడటం తగ్గించి ఎలక్ట్రిక్, ఇథేనాల్ ఇంధనాలపై ఆధారపడటం పెరిగినప్పుడే అది సాధ్యపడుతుంది అని నితిన్ గడ్కరి వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నితిన్ గడ్కరి మాట్లాడుతూ, మన దేశంలో రైతులు అన్నదాతలు మాత్రమే కాదని.. వారు ఉర్జాదాతలు (ఇంధనం దాతలు) కూడా అని కొనియాడారు. ఇకపై రైతులు ఉత్పత్తి చేసే ఇథేనాల్ ఇంధనంతోనే వాహనాలు పరుగులు తీయనున్నాయి అని అన్నారు. అందుకే పెట్రోల్‌కి ఎలక్ట్రిక్, ఇథేనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగం పెరగాలి అని చెబుతూనే భవిష్యత్ లో ఎలక్ట్రిక్, ఇథనాల్
ఇంధనం కీలక పాత్ర పోషించనున్నాయి అని నితిన్ గడ్కరి స్పష్టంచేశారు.