హైదరాబాద్: జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్‌పల్లికి చేరుకుని ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది. అనంతరం అక్కడి నుంచి నేరుగా చటాన్‌పల్లికి చేరుకుని దిశ అత్యాచారం, హత్య జరిగిన చోటును నిశితంగా పరిశీలించింది. దిశ మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతాన్ని.. అక్కడి నుంచి ఏ వైపున, ఎంత దూరంలో నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిందనే వివరాలను సభ్యులు సేకరించారు. ఘటన జరిగిన తీరుతెన్నుల గురించి శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదిలావుంటే, మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన వసతులు లేవని తమ పిటిషన్‌లో పేర్కొన్న పోలీసులు.. ఇప్పటికే మృతదేహాలు కుళ్లిపోయాయని తెలిపారు. మరోవైపు కుటుంబసభ్యులు కూడా తమ వారి మృతదేహాలను తమకు అప్పగించాలని కోరుతున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆలస్యమైనా కొద్ది శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు.. వెంటనే ఇక్కడి నుంచి మృతదేహాలను తరలించేలా ఆదేశాలివ్వాలని తమ పిటిషన్ ద్వారా విజ్ఞప్తిచేశారు.
ఎన్‌కౌంటర్ ఘటనాస్థలాన్ని నిశితంగా పరిశీలించిన నిజ నిర్ధారణ కమిటి