ఆన్‌లైన్ దొంగకు 28 సార్లు ఓటీపీ షేర్ చేసింది.. రూ.6 లక్షలు గోల్‌మాల్

ముంబయిలో జరిగిన ఓ ఆన్‌లైన్ మోసంలో ఓ మధ్య తరగతి అభాగ్యురాలు మోసపోయింది. 

Last Updated : Jun 3, 2018, 11:08 PM IST
ఆన్‌లైన్ దొంగకు 28 సార్లు ఓటీపీ షేర్ చేసింది.. రూ.6 లక్షలు గోల్‌మాల్

ముంబయిలో జరిగిన ఓ ఆన్‌లైన్ మోసంలో ఓ మధ్య తరగతి అభాగ్యురాలు మోసపోయింది. బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాను అని చెప్పిన ఓ ఆన్‌లైన్ మోసగాడి వలలో చిక్కుకుని డబ్బును పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే నవీ ముంబయి ప్రాంతానికి చెందిన ఓ ఇల్లాలికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందని, కొత్త ఏటీఎం కార్డు కావాలంటే ఆమె కార్డు వివరాలు ఇవ్వాలని సదరు వ్యక్తి చెప్పగా.. ఆమె ఆ వివరాలు తెలిపింది.

తర్వాత అదే వ్యక్తి ఆమె మొబైల్‌కి ఓటీపీ నెంబరు వస్తుందని నమ్మబలికి నెమ్మదిగా ఆ వివరాలు కూడా గ్రహించడం జరిగింది. ఒకసారి ఆ ఇల్లాలికి అనుమానం రాలేదని నిర్థారించుకున్నాక.. ఆమెకు పదే పదే ఫోన్ చేసి ఓటీపీ నెంబర్లను ఆ వ్యక్తి అడిగి తెలుసుకోవడం జరిగింది. అలా 28 ఓటీపీ నెంబర్లను పొందిన మోసగాడు దాదాపు రూ.6 లక్షల రూపాయల వరకు ఆన్‌లైన్ లావాదేవీలు చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవలే పాస్ బుక్ అప్డేట్ చేయించడం కోసం బ్యాంకుకి వెళ్లిన ఆ ఇల్లాలు దాదాపు రూ.6 లక్షల రూపాయలు తన అకౌంటు నుండి డ్రా అయినట్లు తెలుసుకొని షాక్‌కు గురైంది. ఆమెకు ఆన్‌లైన్ ఫ్రాడ్ మీద అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని నిర్థారించుకున్న బ్యాంకు అధికారులు.. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయమని తెలిపారు. తన కుమారుడు ఎడ్యుకేషన్ లోన్‌కు చెందిన డబ్బు, ఓ ఆన్‌లైన్ మోసగాడు కాజేయడంతో ఆ ఇల్లాలు ఇప్పుడు కన్నీరుమున్నీరవుతుంది. ప్రస్తుతం ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.  

Trending News