అమిత్ షాను ఆకాశానికెత్తిన ముఖేష్ అంబాని

అమిత్ షాను ఆకాశానికెత్తిన ముఖేష్ అంబాని

Last Updated : Aug 30, 2019, 02:45 PM IST
అమిత్ షాను ఆకాశానికెత్తిన ముఖేష్ అంబాని

ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను అసలైన కర్మయోగిగా, భారత ఉక్కు మనిషిగా అభివర్ణిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. గాంధీ నగర్‌లోని పండిట్‌ దీన్‌ దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో అమిత్‌షా, ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షాను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ... అమిత్‌ భాయ్‌, మీరు అసలైన కర్మయోగి. మీరు అసలైన ఐరన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అని పొగడ్తల్లో ముంచెత్తారు. మీలాంటి నాయకుడు ఉండటం ఒకప్పుడు గుజరాత్‌‌కు, ఇప్పుడు యావత్ దేశానికి అదృష్టం అని కొనియాడారు. ఇదే క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థను 5ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేర్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయం కూడా గొప్పదే అంటూ మోదీని ఆకాశానికెత్తారు. 

ఈ స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి అంబానీ మాట్లాడుతూ.. భారత్ ఇప్పుడు సురక్షిత వలయంలో ఉందని అన్నారు. మీ లక్ష్యం ఎప్పుడూ తగ్గకుండా చూసుకోండి. పెద్ద లక్ష్యాలను ఏర్పరుచుకోండి. భవిష్యత్తులో మీ కలలను సాకారం చేసే విధంగా అవకాశాలు అందించే స్థాయికి భారత్ చేరుకుంటుందని అంబాని ఆశాభావం వ్యక్తంచేశారు. 

గాంధీనగర్ ఎంపీగా లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. 2014 వరకు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టపర్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని అన్నారు. అయితే, గత ఐదేళ్లలో.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దామని తెలిపారు.

Trending News