అగ్నికి ఆహుతైన రెండు హోటళ్లు, ఐదుగురు మృతి, 50 మందికిపైగా గాయాలు

ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Last Updated : Jun 19, 2018, 09:38 PM IST
అగ్నికి ఆహుతైన రెండు హోటళ్లు, ఐదుగురు మృతి, 50 మందికిపైగా గాయాలు

ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలోని చార్‌బాగ్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో రెండు హోటళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆ హోటళ్లలో చిక్కుకున్న వారిలో ఐదుగురు దుర్మరణం చెందగా మరో 50 మంది వరకు గాయపడ్డారు. మొదట విరాట్ ఇంటర్నేషనల్ హోటల్లో అంటుకున్న మంటలు క్షణాల వ్యవధిలోనే ఆ పక్కనే ఉన్న ఎస్ఎస్‌జే ఇంటర్నేషనల్ అనే మరో హోటల్‌కి వ్యాపించాయి. దీంతో పక్కపక్కనే ఆనుకుని ఉన్న ఆ రెండు హోటళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం చేసుకుని స్పందించేలోపే అంతా జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చనిపోయిన వారిలో ఓ మహిళ, మరొక చిన్నారి కూడా ఉన్నారు. గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

 

అతి కష్టం మీద మంటలు ఆర్పిన అగ్ని మాపక సిబ్బంది లోపల ఇంకెవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం వెనుకున్న కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం హోటల్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని దర్యాప్తు బృందం ఓ ప్రాథమిక అంచనాకు వచ్చింది. అయితే, అసలు కారణాలు మాత్రం పూర్తి స్థాయి విచారణ అనంతరమే తెలియాల్సి వుంది. 

 

 

Trending News