18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మద్రాస్ హై కోర్టు

18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఊహించని తీర్పు వెల్లడించిన మద్రాస్ హై కోర్టు  

Last Updated : Jun 14, 2018, 04:33 PM IST
18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మద్రాస్ హై కోర్టు

తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో వేరుకుంపటి పెట్టుకున్న వీకే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కి మద్దతు నిలిచిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో నేడు తుది తీర్పు వెలువడుతుందని ఎదురుచూసిన వాళ్లందరికీ ఊహించని షాక్‌ని ఇస్తూ ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులను వెల్లడించారు. ఇద్దరు న్యాయమూర్తులు కలిగిన ధర్మాసనం రెండు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించడంతో ఈ కేసు విచారణను విస్తృత స్థాయి ధర్మాసనానికి బదలాయిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్‌ పి ధనపాల్ అనర్హత వేటు వేయడం సబబేనని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్‌ సుందర్ అందుకు భిన్నమైన తీర్పుని వినిపించారు. ఈ కేసులో ఎటువంటి స్పష్టమైన తీర్పు వెలువడినా పళనిస్వామి ప్రభుత్వానికి విశ్వాస గండం తప్పదనే వాదనలు బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇద్దరు న్యాయమూర్తులు రెండు వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో తాత్కాలికంగా పళనిస్వామి ప్రభుత్వానికి గండం తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతేడాది ఫిబ్రవరిలో పళనిస్వామి సర్కార్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కునే సమయంలో అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ విప్‌ని ధిక్కరించి పార్టీకి వ్యతిరేకంగా దినకనర్‌కు మద్దతు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ తమిళనాడు స్పీకర్‌ పి ధనపాల్ వారిపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ 18 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించి కొత్త శాసన సభ్యులని ఎన్నుకోవాల్సిందిగా కోరుతూ స్పీకర్‌ అప్పట్లోనే ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. 

ఇదిలావుంటే, స్పీకర్‌ పి ధనపాల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేలు మద్రాస్‌ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సదరు ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై మద్రాస్ హై కోర్టు స్పందిస్తూ స్పీకర్‌ నిర్ణయంపై స్టే ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం నేడు వెలువడనున్న తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందా అనే ఉత్కంఠ కనిపించింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ 18 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దును ఆమోదిస్తూ హైకోర్టు తీర్పునిస్తే, ఆ 18 నియోజకవర్గాల్లో మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. 

అదే కానీ జరిగితే ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే నుంచి వస్తున్న విమర్శల మధ్య తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య పరిపాలన కొనసాగిస్తున్న పళనిస్వామి వర్గం ఆ 18 నియోజకవర్గాల్లో మళ్లీ తమ అభ్యర్థులనే గెలిపించుకోవడం అతికష్టంతో కూడుకున్న పని అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించి హైకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుని కొట్టేస్తే, ఆ తర్వాత అదే 18 మంది ఎమ్మెల్యేలు మళ్లీ దినకరన్‌తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం ఉంది.

పళనిస్వామిని ఎలాగైనా గద్దె దించాలని మొదటి నుంచీ గట్టిగా ప్రయత్నిస్తున్న దినకరన్ మళ్లీ ఆ 18 మంది ఎమ్మెల్యేలతో పళని సర్కార్‌కి వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసే ప్రమాదం లేకపోలేదు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు ప్రస్తుతం 89 మంది ఎమ్మెలేలు ఉండగా వారికి దినకరన్ వర్గం కూడా తోడై.. వారికి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అండగా నిలిస్తే, పళని సర్కార్ మళ్లీ మెజార్టీ గండంలో పడుతుంది. పళనిస్వామి ప్రభుత్వానికి ఇన్ని ప్రతికూల పరిస్థితులను తీసుకొచ్చే ఈ తీర్పుపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Trending News