కేరళ హైకోర్టులో ఓ 25 ఏళ్ల యువతి పిటీషన్ దాఖలు చేశారు. తనను ప్రేమించి పెళ్లిచేసుకున్న తర్వాత భర్త ఆమెను బలవంతంగా మతాన్ని మార్పించాడని..ఇప్పుడు ఇస్లామ్‌ని స్వీకరించకపోతే ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అమ్మేస్తానని బెదిరిస్తున్నాడని కేసు ఫైల్ చేశారు. బెంగళూరులో మహ్మద్ రియాజ్ అనే ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె, భర్త ప్రోద్బలంతో మతం మార్చుకున్నానని తెలిపింది. ఆ తర్వాత తనతో కలిసి సౌదీ అరేబియా వెళ్లాక.. తనను ఐసిస్ సంస్థతో కలిసి పని చేయాలని బలవంతపెడుతున్న రియాజ్ నుండి తప్పించుకొని బయటకు వచ్చేసినట్లు ఆమె చెప్పింది. కేరళలో పుట్టి పెరిగిన ఆ యువతి, గుజరాత్‌లో కొన్నాళ్లు నివసించినట్లు సమాచారం. పెళ్లయ్యాక ముస్లిం ప్రభోదకుడైన జాకీర్ నాయక్ వీడియోలను చూడమని భర్త వేధించేవాడని.. ఇస్లామిక్ తరగతులకు హాజరుకమ్మని తెలిపేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుకి సంబంధించి వాదనలను నవంబరు 13 తేదీన విననున్నట్లు హైకోర్టు తెలిపింది.