ఆదివారం తీవ్రవాది కమాండర్ బుర్హాన్ వని రెండవ వర్ధంతి సందర్భంగా తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ తమ సభ్యుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత పోలీసు సర్వీస్ (IPS) అధికారి సోదరుడు కూడా ఉన్నారు.
జమ్ముకాశ్మీర్ సోఫియన్ జిల్లా డ్రాగుడ్ గ్రామానికి చెందిన షంసుల్ హక్ మెంగ్నూ(25) శ్రీనగర్‌లో యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS) కోర్సు చేస్తున్నాడు. ఇతడు మే నెల నుంచి కనిపించడం లేదు. షంసుల్ అన్నయ్య ఇనాముల్ హక్ 2012 IPS బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు.
హిజ్బుల్ ముజాహిదీన్ తాజాగా విడుదల చేసిన జాబితాలో షంసుల్ AK-47 రైఫిల్‌ను పట్టుకొని నిల్చున్న ఫోటో ఉంది. "అవును, షాంసుల్ హిజ్బుల్‌లో చేరాడు" అని ఓ పోలీసు అధికారి తెలిపారు. మెంగ్నూ కుటుంబ సభ్యులు అతడు తప్పిపోయినట్లు ఇంతవరకు మిస్సింగ్ రిపోర్ట్ ఇవ్వలేదని తెలిపారు.
హిజ్బుల్ తుపాకీ పట్టుకొని నిల్చున్న ఫోటో మే 25, 2018 అని ఉంది. దీంతో అతడు తీవ్రవాద సంస్థలో చేరినట్లు అనుమానిస్తున్నారు. మే 25న షంసుల్ మిలిటెంట్లలో చేరాడని, అతడి కోడ్‌నేమ్ బుర్హాన్ సనీ అని ఫొటో ఆధారంగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో గత రెండు సంవత్సరాలుగా తమ సంస్థలో చేరిన యువ ఉగ్రవాదుల ఫోటోలను హిజ్బుల్ విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 50 మంది యువకులు తీవ్రవాద సంస్థలో చేరారని సమాచారం.
'గత 3 రోజులు, నా తల్లి ఆహారం మరియు మందులు తీసుకోవడం లేదు. అతనిని తిరిగి పంపాలని ఆ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిజమైన జిహాదీ వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవలందించాలి' అని అతని సోదరుడు తెలిపాడు.