కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ ముందంజ

కర్ణాటక రాష్ట్రంలో ఆగస్టు 31, 2018న నగర, పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Last Updated : Sep 3, 2018, 05:24 PM IST
కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ ముందంజ

కర్ణాటక రాష్ట్రంలో ఆగస్టు 31, 2018న నగర, పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.  కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 102 పట్టణ స్థానిక సంస్థలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆగస్టు 31వ తేదీన ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపాలిటీలు, 53 పట్టణ మున్సిపాలిటీలు, 23 పట్టణ పంచాయతీలు, మూడు సిటీ కార్పొరేషన్లలోని 135 వార్డులను కలుపుకొని మొత్తం 2,664 వార్డుల్లో పోలింగ్ జరిగింది.

నిజానికి 105 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కొడగు జిల్లాలో మెరుపు వర్షాలు, వరదల కారణంగా సోమ్వార్‌పేట్, విరాజ్‌పేట్, కుషాల్‌నగర్‌లో ఎన్నికలను వాయిదా వేశారు.

తాజా సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉంది. 102 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 2664 స్థానాలకు ఇప్పటి వరకూ 1412 స్థానాల ఫలితాలను విడుదల చేశారు. కాంగ్రెస్ 560, బిజెపి 499, జెడి(ఎస్) 178, స్వతంత్ర అభ్యర్థులు 150 సీట్లు గెలుచుకున్నాయి.

 

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా..స్థానిక ఎన్నికల్లో.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) లు వేర్వేరుగా పోటీ చేశాయి. హంగ్‌ ఏర్పడితే పరస్పరం సహకరించుకుంటామని కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)లు ప్రకటించాయి.

Trending News