కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018: 222 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది.

Last Updated : May 12, 2018, 12:53 PM IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018: 222 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. వేసవి ఎండత తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం ఒక గంట పెంచింది. ఉదయం 7  గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పుడు 222 స్థానాలకు ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. బరిలో 2500 మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 4.98 కోట్ల మంది ఓటర్లు (మహిళలు-2.44కోట్లు, పురుషులు-2.52కోట్లు, ట్రాన్స్ జెండర్స్-4552) ఉన్నారు. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 58 వేలకు పైగా  పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో 3.5లక్షల మంది భద్రతా సిబ్బందిని నియమించారు.

కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మరణించిన కారణంగా ఆ స్థానానికి, నకిలీ ఓటర్ ఐడీ కార్డుల వ్యవహారంలో ఆర్ఆర్ నగర్ (రాజరాజేశ్వరి నగర్) అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఆర్ఆర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికలను మే 28వ తేదీన నిర్వహించనుంది. మే 31న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

కాగా.. ఓటుహక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద  బారులుతీరారు. షికర్పూర్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యురప్ప, పుత్తూరులో కేంద్ర మంత్రి సదానంద గౌడ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

 

 

 

 

 

 

 

Trending News