బీజేపీ పార్టీ 59 మంది అభ్యర్థులతో శుక్రవారం సాయంత్రం మూడో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో తెలుగు, కన్నడ చలనచిత్ర నటుడు సాయికుమార్‌తో పాటు గాలి కరుణాకర్ రెడ్డికి చోటు లభించింది. ముగ్గురు మహిళలకూ, ముగ్గురు మాజీ మంత్రులు రామదాసు (కృష్ణరాజ), గాలి కరుణాకర్ రెడ్డి (హరపన హళ్లి), సునీల్ వల్యాపుర (చించోళి)లకు చోటు దక్కింది.
బళ్ళారి కాంగ్రెస్ టికెట్టు దక్కలేదని శుక్రవారం బీజేపీలో చేరిన ఎన్.వై.గోపాలకృష్ణకు కూడ్లిగి నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు కమలనాథులు. మంగళూరులో కాషాయ జెండా ఎగరవేసితీరాలనే కాంక్షతో మంగళూరు, మంగళూరు ఉత్తర, మంగళూరు దక్షిణ స్థానాలకు సంతోష్ కుమార్ రై, డాక్టర్ భరత్ శెట్టి, వేదవ్యాస్ కామత్‌కు టికెట్లు ఇచ్చారు. లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున ఎం.పి.కుమారస్వామి (మూడిగేరె), రఘుపతి భట్ (ఉడుపి)లకు పోటీనిచ్చే అవకాశం ఇచ్చింది. అలానే విధానసభ మాజీ స్పీకర్ కే.జీ.బొపయ్యకు వీరాజపేట టికెట్టు ఇచ్చారు.
ఈసారి వారసులకు టికెట్లు దక్కాయి. విధానపరిషత్తు మాజీ సభ్యుడు రామచంద్ర గౌడ తనయుడు సప్తగిరి గౌడ(గాంధీనగర), మాజీ మంత్రి ముథోల్ అభ్యర్థి గోవింద కార్జోల్ కుమారుడు డాక్టర్ గొల్ప కార్జోల(నాగఠాణ), మాజీ మంత్రి గోవిందరాజనగర అభ్యర్థి వి.సోమన్న కుమారుడు డాక్టర్ అరుణ్ (అరిసికేరే) పోటీ చేయనున్నారు. మాజీ ఎంఎల్ఏ సంపంగి కుమార్తె అశ్వని.. కేజీఎఫ్ నుంచి పోటీ చేయనున్నారు.