ప్రముఖ తమిళనాడు జర్నలిస్ట్, నక్కీరన్ పత్రిక సంపాదకుడు గోపాల్‌ను మంగళవారం చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం ప్రకారం, 'చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8:15 గంటలకు గోపాల్‌ను డిప్యూటీ కమిషనర్ స్థాయి హోదా కలిగిన పోలీస్ అధికారి అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.' అని సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు ఈ దినపత్రిక తెలిపింది. గవర్నర్ పురోహిత్ కార్యాలయం- రాజ్ భవన్ ఫిర్యాదుతో నక్కీరన్ పత్రిక సంపాదకుడు గోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. గవర్నర్‌పై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని రాజ్ భవన్ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాలేజీ విద్యార్థినులను లైంగిక కార్యాలకు ప్రోత్సహిస్తూ తప్పుదారి పట్టిస్తున్నదన్న ఆరోపణలతో దేవాంగ ఆర్ట్స్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ సెక్స్ స్కాండల్‌కు, గవర్నర్‌కు లింక్ పెడుతూ కథనాన్ని అల్లారని, నిర్మలాదేవి రాజ్ భవన్‌ను సందర్శించారని కథనాన్ని ప్రచురించారని.. ఇవన్నీ అసత్య కథనాలని గవర్నర్ కార్యాలయం ఫిర్యాదు చేయగా పోలీసులు గోపాల్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
కాగా కొద్దిసేపటి క్రితం ఎండీఎంకె చీఫ్ వైగో గోపాల్‌ను చూడటానికి చింటాద్రిపేట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లగా.. పోలీసులు ఆయన్ను అనుమతించలేదు. దీంతో వైగో 'రాష్ట్రంలో ఏమైనా గవర్నర్ పాలన నడుస్తోందా?' అని మండిపడ్డారు.
గవర్నర్‌పై తప్పుడు కథనాలు.. ఎడిటర్ అరెస్టు