త్వరలో ఇస్రో టీవీ ఛానల్ రానుంది. లోక్‌సభ టీవీ తరహాలో ఇస్రో నుండి టీవీ ఛానల్ రానుందని ఆ సంస్థ ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలను ఆదివారం బెంగళూరులో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో మూడు, నాలుగు నెలల్లో ఇస్రో టీవీ ఛానల్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు చేరవేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా.. రానున్న మూడేళ్లలో 50కీలక ప్రాజెక్టులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది యూకేకు చెందిన రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ42 ద్వారా ప్రయోగించనున్నట్లు తెలిపారు. పీఎస్ఎల్వీ-సీ43 ద్వారా 30 వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 3న చంద్రయాన్–2, డిసెంబర్లో ఆదిత్య-ఎల్1 ప్రయోగిస్తామన్నారు. ఒక్క 2019లోనే 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్లు కస్తూరి రంగన్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.