న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్ హద్దులు మీరితే ఉపేక్షించేది లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. శాంతి ఒప్పందాలను అనుసరించి ఉంటున్నామని, అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇక్కడ బుధవారం నిర్వహించిన 72వ భారత సైనిక దినోత్సవం వేడుకల్లో జనరల్ నవరాణే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత ఆర్మీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్పులపై సైతం అవగాహన కలిగి ఉన్నాం. టెర్రరిజం, సరిహద్దు సమస్యల విషయంపై జీరో టోలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నాం.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చాలా ప్రత్యామ్నాయాలున్నాయి. ఇందుకోసం ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. సాయుధ బలగాలకు సైనికులే బలం, విలువైన సంపద. సరిహద్దుల్లో ఏ అలజడి లేనంతవరకే శాంతిని కొనసాగిస్తాం. భవిష్యత్‌లో తలెత్తే ఏ యుద్ధాన్నైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని’ ఆర్మీ డే సందర్భంగా ఆర్మీ కొత్త బాస్ జనరల్ ఎంఎం నరవాణే పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపారు.
దేశానికి విశిష్ట సేవలందిస్తున్న సాయుధ బలగాలకు వారి కటుంబసభ్యులకు ఆర్మీ డే సందర్భంగా అభినందనలు తెలిపారు. టెక్నాలజీ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదన్నారు. మనపై ఉన్న గౌరవాన్ని, విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కొనసాగేలా ప్రవర్తించాలని సైనికులకు సూచించారు. భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరవాణే తొలి ప్రసంగం కావడం విశేషం. అంతకుముందు న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక పరేడ్‌ను వీక్షించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ నరవాణే స్ట్రాంగ్ వార్నింగ్