పాకిస్తాన్ యుద్ధ విమానాలు దాడికి పాల్పడిన రోజు అసలు ఏం జరిగింది ?

సుఖోయ్-30 యుద్ధ విమానం దాడికి తోకముడిచిన F-16 యుద్ధ విమానం !

Last Updated : Mar 6, 2019, 08:21 AM IST
పాకిస్తాన్ యుద్ధ విమానాలు దాడికి పాల్పడిన రోజు అసలు ఏం జరిగింది ?

న్యూఢిల్లీ: పుల్వామా దాడులకు ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఫిబ్రవరి 26న తెల్లవారిజామున భారత వాయుసేన మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మెరుపు దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 27న తెల్లవారిజామున భారత్‌లోని మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ యుద్ధ విమానాలు భారత్‌లోకి ప్రవేశించగా, ఈ దాడిని భారత వాయుసేన విజయవంతంగా తిప్పికొట్టింది. ఆరోజు ఏం జరిగిందనే వివరాలను వెల్లడిస్తూ భారత వాయుసేన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ యుద్ధ విమానాలు భారత్‌పై దాడికి పాల్పడటానికి వస్తుండగా అవి పాక్ గగనతలంలో వున్నప్పుడే భారత భద్రత బలగాలకు చెందిన రాడార్లు వాటిని గుర్తించాయని, వెంటనే భారత వాయుసేన పూర్తిస్థాయిలో అప్రమత్తమైందని భారత వాయుసేన తెలిపింది. మిరాజ్-2000, సుఖోయ్ 30, మిగ్-21 బైసన్ వంటి యుద్ధ విమానాలు రంగంలోకి దిగి పాకిస్తాన్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాల దాడిని తిప్పికొట్టాయని భారత వాయుసేన స్పష్టంచేసింది.

భారత మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో పాకిస్తాన్ F-16 యుద్ధ విమానం వదిలిన ఎయిమ్-120 అమ్‌రామ్(AMRAAM) మిస్సైల్స్‌ను సైతం సుఖోయ్-30 యుద్ధ విమానం విజయవంతంగా నిర్విర్యం చేయగలిగిందని భారత వాయుసేన ఈ ప్రకటనలో పేర్కొంది. జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరి ప్రాంతానిరకి తూర్పు భాగంలో పాకిస్థాన్ యుద్ధ విమానం వదిలిన మిస్సైల్స్ విడిభాగాలు పడిపోయాయని భారత వాయుసేన స్పష్టంచేసింది.

 

అంతేకాకుండా సుఖోయ్-30 యుద్ధ విమానాన్ని కూల్చేశామని పాకిస్తాన్ వాయుసేన చేసిన ప్రకటనలోనూ వాస్తవం లేదని భారత వాయుసేన ప్రకటించింది. F-16 యుద్ధ విమానాన్ని భారత వాయుసేన కూల్చేసిందనే చేదునిజాన్ని కప్పిపెట్టడానికే పాకిస్తాన్‌ అవాస్తవాలను దుష్ప్రచారం చేస్తోందని భారత వాయుసేన అభిప్రాయపడింది.

 

Trending News