భారత్‌లో ప్రైవేట్ పర్యటనలో హిల్లరీ క్లింటన్

మాజీ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆదివారం ఖార్గోన్ జిల్లా మహేశ్వర్ పట్టణంలోని అహిల్య కోటకు వచ్చారు.

Last Updated : Mar 12, 2018, 05:35 PM IST
భారత్‌లో ప్రైవేట్ పర్యటనలో హిల్లరీ క్లింటన్

ఇండోర్(మధ్య ప్రదేశ్): మాజీ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆదివారం ఖార్గోన్ జిల్లా మహేశ్వర్ పట్టణంలోని అహిల్య కోటకు వచ్చారు. మూడు రోజుల ప్రైవేట్ పర్యటనలో భాగంగా క్లింటన్ ఇటీవలే ఇండోర్ ప్రాంతానికి వచ్చారు. ఆమె మార్చి 11 నుండి మార్చి 13 వరకు భారత్‌లో పర్యటిస్తున్నట్లు షెడ్యూల్ ఖరారైంది . తాజా నివేదికల ప్రకారం, హిల్లరీ క్లింటన్ తన పర్యటనలో భాగంగా సమీప పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. హిల్లరీ క్లింటన్, హోల్కర్ సామ్రాజ్య వంశీకుడైన రిచర్డ్ హోల్కర్ ఆహ్వానం మేరకు మహేశ్వర్‌కు వచ్చారని నివేదికలు తెలిపాయి.

ప్రైవేట్ పర్యటనలో భాగంగా, హిల్లరీ క్లింటన్ ఇండియా టుడే కంక్లేవ్‌లో ప్రసంగించారు. పాక్‌ వైఖరిపై మండిపడ్డారు. ‘భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా వాళ్లేం (పాక్‌) ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరో పొరుగు దేశం అప్ఘనిస్థాన్‌తోనూ అదే వైఖరిని కొనసాగిస్తున్నారు. దీనికి చెక్‌ పడాల్సిన అవసరం ఉంది. అమెరికా పాక్‌ను కట్టడి చేయటంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే చేస్తుందని ఆశిస్తున్నా’ అని హిల్లరీ పేర్కొన్నారు.

2016 అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన క్లింటన్, రిపబ్లికన్ ప్రత్యర్ధి డోనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు.

 

Trending News