రానున్న 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని కొన్ని ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) శుక్రవారం అంచనా వేసింది. వర్షాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో శనివారం వరకు బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, జార్ఖండ్, యూపీ, ఉత్తరాఖండ్,హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, హిమాచల్, తూర్పు రాజస్థాన్, కొంకణ్, గోవా, విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ బులిటెన్ ను విడుదల చేసినట్లు ఎన్డీఎంఏ పేర్కొంది.
ప్రథమ చికిత్స కిట్లు, టార్చిలైట్, మంచినీళ్ల సీసాలు, నిల్వవుండే ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలని, పిల్లలను నీరు ఉన్న చోట ఆడుకోనివ్వొద్దని ప్రజలను ఎన్డీఎంఏ కోరింది.
ఇటీవల కేరళ సహా పది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా 1400 మందిపైగా ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళలో 488 మంది, ఉత్తరప్రదేశ్లో 254 మంది, పశ్చిమబెంగాల్లో 210 మంది, కర్నాటకలో 170, మహారాష్ట్రలో 139, గుజరాత్లో 52, అస్సాంలో 50, ఉత్తరాఖండ్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.