న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు దంచి కొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం అతలాకుతలమైంది. జన జీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వరదల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.
మణిపూర్‌లో కొండచరియలు విరిగి పడి 9 మంది మృతి
భారీ వర్షాలకు మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో 9 మంది మృతి చెందారు. ఈఘటనతో అధికారులు, సిబ్బంది అప్రమత్తయ్యారు. కొండ చరియలు పడి మృతి చెందిన ఏడుగురి మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
Nine dead after landslide hits Manipur's Tamenglong. More details awaited. pic.twitter.com/0Oh505EGNA
— ANI (@ANI) July 11, 2018
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు ఏడుగురు మృతి
రుతుపవనాల ప్రభావంతో పడుతున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ఏడుగురు మరణించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్ళకు సెలవు ప్రకటించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. పలు ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. రాబోయే మూడు రోజులలో రాష్ట్రం అంతటా భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.