ఏమాత్రం సంతోషంగా లేను.. కంటతడిపెట్టిన కుమారస్వామి

ముఖ్యమంత్రి పదవి దక్కినా తాను ఏమాత్రం సంతోషంగా లేనని హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.

Last Updated : Jul 15, 2018, 05:18 PM IST
ఏమాత్రం సంతోషంగా లేను.. కంటతడిపెట్టిన కుమారస్వామి

ముఖ్యమంత్రి పదవి దక్కినా తాను ఏమాత్రం సంతోషంగా లేనని హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. బెంగళూరులో శనివారం జనతాదళ్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. 'నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం జనతాదళ్‌ కార్యకర్తలకు, నేతలకు మాత్రమే సంతోషం. కానీ నేను సంతోషంగా లేను. నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషం కంటే తక్కువేమీ కాదు’’ అని చెబుతూ కంటతడిపెట్టారు.  

సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయని అన్నారు. రైతుల కష్టాలు తీర్చాలన్న లక్ష్యంతో రుణమాఫీ ప్రకటించానని.. ఆర్థికంగా పెనుభారమైన ఈ పథకానికి నిధుల సమీకరణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే పన్నుల భారాన్ని మోపానని కుమారస్వామి ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజల కోసం ఇంత చేస్తున్నా వారికి తనపై ఇంకా నమ్మకం కలగలేదని విచారం వ్యక్తం చేశారు. ‘‘దేవుడైతే నాకీ అధికారం (సీఎం పదవి) ఇచ్చాడు. నేను ఎన్ని రోజులు పదవిలో ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడు’’ అని కుమారస్వామి అన్నారు.

 

ప్రజల విశ్వాసాన్ని పొందిన రోజే తాను సన్మానం చేయించుకుంటానని ముఖ్యమంత్రి ఉద్వేగంగా మాట్లాడారు. కుమారస్వామి పదే పదే కన్నీరు పెడుతున్న సందర్భాల్లో కార్యకర్తలు ‘మీరు ఏడవకండి- మీ వెంట మేమున్నాం’ అంటూ ధైర్యం చెప్పారు. కాగా.. ఈ సన్మాన కార్యక్రమానికి సీఎం సోదరుడైన మంత్రి హెచ్‌.డి.రేవణ్ణ, పార్టీ కార్యాధ్యక్షుడు హెచ్‌.డి.ప్రజ్వల్‌రేవణ్ణ తదితరులతో పాటు పలువురు మంత్రులు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.

మరోవైపు, కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడి ఆరోగ్యం గురించి కలత చెందుతున్నారు. విశ్రాంతి లేకుండా ఏకధాటిగా 18 గంటలు పనిచేస్తున్నారని.. ఈ ప్రభావం అంతంతమాత్రంగానే ఉన్న ఆరోగ్యంపై పడుతుందని విచారిస్తున్నారు.

Trending News