బుల్లెట్ ఎక్కిన సీఎం సాబ్.. అనుసరించిన అనుచరగణం

ఈ మోగా మోటార్ సైకిల్ ర్యాలీలో దాదాపు లక్ష మంది పాల్గొంటారని అంచనా

Last Updated : Feb 15, 2018, 04:46 PM IST
బుల్లెట్ ఎక్కిన సీఎం సాబ్.. అనుసరించిన అనుచరగణం

నిత్యం భారీ సంఖ్యలో వెళ్లే కార్ల కాన్వాయ్‌లో తిరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి, సరదాగా బుల్లెట్ నడుపుకుంటూ తమ మధ్యలోకి వస్తే ఆ సీన్ ఎలా వుంటుందో చూసే అవకాశం వచ్చింది హర్యానాలోని జింద్ జిల్లా కేంద్ర వాసులకి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం జింద్‌లో ఓ భారీ మోటార్ సైకిల్స్ ర్యాలీ నిర్వహంచనున్న నేపథ్యంలో ఇదే ర్యాలీలో పాల్గొనేందుకు చేసిన రిహార్సల్స్‌లో భాగంగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ బుధవారమే బుల్లెట్ ఎక్కి ఓ రౌండ్ వేశారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో దాదాపు లక్ష మందికిపైగా బీజేపీ కార్యకర్తలు తమ ద్విచక్రవాహనాలతో పాల్గొంటారని బీజేపీ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

 

యువ హూంకార్ ర్యాలీ పేరిట జరగనున్న ఈ మెగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటానికి వస్తున్న అమిత్ షా సైతం వేదికకు కొంత దూరంలో వుందనగా స్వయంగా బైక్ నడపనున్నారని తెలుస్తోంది. ఈ ర్యాలీ అనంతరం వేదికపై నుంచి అమిత్ షా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఈ మెగా మోటార్ సైకిల్ ర్యాలీకి బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే బుధవారం సీఎం ఎం.ఎల్. ఖత్తర్ ఇలా బుల్లెట్ ఎక్కి సవారీ చేశారు. 63 ఏళ్ల సీఎం సాబ్ తమ ముందు ఎంతో ఎనర్జిటిక్‌గా బుల్లెట్ నడుపుతోంటే.. ఆ వెనకాలే పార్టీ కార్యకర్తలు, అనుచరులు కేరింతలు కొడుతూ ఆయన్ని అనుసరించారు. 

 

తాను బుల్లెట్ నడిపిన ఫోటోని సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ స్వయంగా ట్వీట్ చేయగా, హర్యానా బీజేపీ రాష్ట్ర శాఖ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. భారీ సంఖ్యలో వాహనాలతో చేపడుతున్న మెగా మోటార్ సైకిల్స్ ర్యాలీ అవడంతో బీజేపీ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నుంచి అనుమతి పొందింది.  

Trending News