Gujarat-Himachal Election Results 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. మరికాసేపట్లో ఓట్ల కౌంటింగ్ మొదలుకాబోతుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం తరువాత దేశవ్యాప్తంగా దృష్టి మొత్తం ఈ ఎన్నికల ఫలితాలపై నెలకొంది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. భవిష్యత్తులో దేశ రాజకీయ పరిస్థితిని నిర్ణయించేందుకు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నాంది కాబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న పోలింగ్ జరిగింది. గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది.
గుజరాత్‌లోని 37 కేంద్రాల్లో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల ప్రధాన అధికారి పి.భారతి తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 182 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి మెజారిటీ మార్క్ 92. ఈసారి గుజరాత్లో 64.33 శాతం పోలింగ్ నమోదైంది.
27 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం
గుజరాత్ రాష్ట్రంలో గత 27 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. గుజరాత్లో గతంలో 2002లో 182 మంది సభ్యుల అసెంబ్లీలో 127 సీట్లు గెలుచుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోరు జరిగినా.. అధికారం మాత్రం కమలం పార్టీదే. ఈసారి ఆప్ రంగంలోకి దిగడంతో త్రిముఖంగా మారింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో మాత్రం బీజేపీ భారీ విజయం సాధిస్తుందని అంటున్నారు. విపక్షాల ఓట్ల చీలిక బీజేపీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ 117 నుంచి 151 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. కాంగ్రెస్‌కు 16 నుంచి 51 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 2 నుంచి 13 సీట్లు వస్తాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే గుజరాత్లో బీజేపీ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇదే జరిగితే దేశంలో ఇంత కాలం నిరంతరాయంగా రాష్ట్రాన్ని పాలించిన ఏకైక పార్టీ అవుతుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గాధ్వి, హార్దిక్ పటేల్ సహా మొత్తం 1,621 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
68 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 10,000 మంది భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు, ఇతర సహాయక సిబ్బంది పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 59 చోట్ల ఏర్పాటు చేసిన 68 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) మనీష్ గార్గ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఆ తర్వాత 8.30 గంటలకు ఈవీఎంల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ఎన్నికల్లో మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
68 మంది సభ్యులున్న హిమాచల్ అసెంబ్లీకి నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో 76.44 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిసెంబర్ 6 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులకు దాదాపు 52,859 (సుమారు 87 శాతం) పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఇది 2017తో పోలిస్తే 17 శాతం పెరిగింది. 2017లో మొత్తం 45,126 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి.
హిమాచల్‌లో సంప్రదాయం మారుతుందా..?
హిమాచల్ ప్రదేశ్‌లో 1985 నుంచి ఏ పార్టీ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఈసారి బీజేపీ విజయం సాధిస్తే అదో రికార్డు. హిమాచల్‌ప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీదేనని అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 412 మంది అభ్యర్థులు బరిలో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. తాము చేస్తున్న అభివృద్ధి ఎజెండాతోనే రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. విజయం ఎవరిదో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
Also Read: Rohit Sharma: రోహిత్ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా! నువ్ 'మగధీర'లో హీరో
Also Read: Delhi MCD Election Result: ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీ చేసిన తప్పులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి