22 రకాల వస్తు, సేవలపై తగ్గిన జీఎస్టీ పన్ను రేటు

22 రకాల వస్తు, సేవలపై తగ్గిన జీఎస్టీ పన్ను రేటు

Last Updated : Dec 22, 2018, 04:19 PM IST
22 రకాల వస్తు, సేవలపై తగ్గిన జీఎస్టీ పన్ను రేటు

న్యూఢిల్లీ: ఢిల్లీలో నేడు జరిగిన 31వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించినట్టుగానే నిత్యవసరాలకు చెందిన 22 రకాల వస్తు, సేవలపై పన్ను రేటును తగ్గించింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. కంప్యూటర్ మానిటర్స్, టీవీ స్క్రీన్స్, టైర్లు, లిథియం అయాన్ బ్యాటరీలతో రూపొందిన పవర్ బ్యాంక్స్ వంటి ఉత్పత్తులను 28% పన్ను స్లాబ్‌లోంచి తొలగించి 18% పన్ను స్లాబ్‌లోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. కేవలం 34 రకాల వస్తు, సేవలపై మాత్రమే 28% పన్ను విధించడం జరుగుతుందని, అవన్నీ లగ్జరీ కేటగిరీ పరిధిలోకి వచ్చేవేనని అన్నారు.

అంతకన్నా ముందుగా కౌన్సిల్ సమావేశంలో పాల్గొని బయటికొచ్చిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకాష్ పంత్ మీడియాతో మాట్లాడుతూ.. 28% స్లాబ్ నుంచి 22 రకాల వస్తు, సేవలపై పన్నును తగ్గించినట్టు తెలిపారు. టీవీ, ఆటో పార్ట్స్, కంప్యూటర్స్, తదితర విద్యుత్ పరికరాలపై పన్ను తగ్గించారని ఆయన వెల్లడించినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది. లగ్జరీ పరిధిలోకి వచ్చే వస్తు, సేవలు మాత్రమే 28% పన్ను రేటు పరిధిలో కొనసాగిస్తున్నట్టు ప్రకాశ్ పంత్ చెప్పారు. తర్వాతి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రియల్ ఎస్టేట్‌పై జీఎస్టీ రేటు అంశంపై మండలి చర్చించనుందని ఈ సందర్భంగా ప్రకాష్ పంత్ స్పష్టంచేశారు.

 

Trending News