మరింత తగ్గనున్న జీఎస్టీ రేట్లు.. గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్!

మరింత తగ్గనున్న జీఎస్టీ రేట్లు

Last Updated : Jan 2, 2019, 09:57 PM IST
మరింత తగ్గనున్న జీఎస్టీ రేట్లు.. గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్!

న్యూఢిల్లీ: డిసెంబర్ 22న జరిగిన 31వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 22కుపైగా వస్తు, సేవలపై జీఎస్టీ రేటు తగ్గడం పౌరులకు కొంతమేరకు ఊరటనిచ్చింది. అయితే, నిర్మాణ రంగం, సిమెంట్ ధరలు వంటి మరిన్ని కీలక వస్తు, సేవలపై సైతం జీఎస్టీ రేటును తగ్గించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 31వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ డిమాండ్‌పై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అందరూ భావించినప్పటికీ పలు ఇతర కారణాలరీత్యా అది సాధ్యపడలేకపోయింది. దీనిపై స్పందించిన కేంద్రం.. జనవరి 10న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరగనున్న 32వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయా డిమాండ్లను పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేస్తామని ప్రకటించింది. 

ప్రస్తుతం నిర్మాణంలో వున్న నివాసాలకు కానీ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని సర్టిఫికెట్‌కి సిద్ధంగా వున్న భవనాలపై కానీ 12% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. అయితే, తాజాగా వెలువడుతున్న వార్తల ప్రకారం.. రానున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నివాస గృహాలపై ప్రస్తుతం వున్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించనున్నట్టు తెలుస్తోంది. అదేకానీ జరిగితే, కొత్తగా గృహాలను కొనుగోలు చేయాలనుకునే వారికి అది కలిసొచ్చే అంశం అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదేకాకుండా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు సైతం ఊరటనిచ్చే నిర్ణయాలు ఈ కౌన్సిల్ సమావేశంలో తీసుకునే అవకాశం వుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Trending News