బెంగళూరు: ప్రముఖ పాత్రికేయులు గౌరీలంకేష్‌ను హతమార్చిన నిందితుల ఊహాచిత్రాలను కర్ణాటక సిట్ పోలీసులు విడుదల చేశారు. ప్రత్యక్ష సాక్ష్యులు అందించిన ఆధారాలను బట్టి ఈ ఊహాచిత్రాల స్కెచ్‌లను ఆర్టిస్టులు వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గత నెల బెంగుళూరులో గౌరీ లంకేష్‌ను ఆమె ఇంటి బయటే దుండగులు కాల్చి చంపారన్న విషయం మనకు తెలిసిందే. ఊహాచిత్రాలు విడుదల చేశాక, సిట్ పోలీస్ ఛీఫ్ బీకే సింగ్ మాట్లాడుతూ "ఈ కేసుతో సంబంధం ఉందని భావించిన దాదాపు 200 నుండి 250 మంది వ్యక్తులను సిట్ విచారించింది. అలాగే ప్రత్యక్ష సాక్షులుగా మేం భావించిన వారిని కూడా విచారించి అనుమానితుల స్కెచ్‌లను విడుదల చేస్తున్నాం" అని తెలియజేశారు. అయితే, ఈ హత్యకు కారకులెవరై ఉండివచ్చునని డిపార్టుమెంట్ భావిస్తుందో చెప్పడానికి మాత్రం సింగ్ నిరాకరించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి సనాతన సంస్థ వారి హస్తం ఉందని భావిస్తున్నారా అన్న ప్రశ్నను కూడా ఆయన దాటవేశారు. తమ దగ్గర అటువంటి సమాచారం ఏమీ లేదని చెప్పారు. హంతకులు రెక్కీ నిర్వహించిన విధానం మరియు సీసీటీవీలో నమోదైన కదలికలు తదితర అంశాలను బేరీజు వేసుకొనే ఊహాచిత్రాలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.