చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని గజ తుఫాన్ వణికిస్తోంది. ప్రస్తుతం నాగపట్టణానికి ఈశాన్యంలో 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాన్ క్రమేపీ తీరం వైపు దూసుకువస్తోంది. తుఫాన్ ప్రభావం కారణంగా ఇప్పటికే తీరం వెంబడి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తుండగా.. వీటి తీవ్రత సుమారు 90 నుంచి వంద కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశాలు ఉన్నాయని, పంబన్ నుంచి కడలూర్ మధ్య ఇవాళ మధ్యాహ్నం గజ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పంబన్-కడలూరు మధ్య తుఫాన్ తీరం దాటనుండటంతో ఆ ప్రాంతాల్లో అధిక ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కడలూరు జిల్లా కలెక్టర్ తిరు వి అంబుసెల్వన్, డిజాష్టర్ మేనేజ్‌మెంట్ ఇంచార్జ్ గంగదీప్ సింగ్ బేడి జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అధికారులు అందరు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. గజ తుఫాన్ తీవ్రత దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. తమిళనాడులో విద్యాసంస్థలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా కథనం పేర్కొంది.
తుఫాన్ తీరానికి చేరువయ్యే సమయంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడులోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే బుధవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై అంతగా కనిపించబోదని, తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు.