ఈ బడ్జెట్‌తో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?

కేంద్ర బడ్జెట్ 2018తో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?..  

Last Updated : Feb 1, 2018, 07:31 PM IST
ఈ బడ్జెట్‌తో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?
వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన 2018 కేంద్ర బడ్జెట్ ఏయే వర్గాలకు మేలు చేకూర్చుతుంది ? ఏయే వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే అంశాలని ఓసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.
 
లాభాలు:
అన్నదాతలు: 
తమ వ్యవసాయ ఉత్పత్తులకి కనీస మద్ధతు ధర కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, వ్యవసాయరంగానికి ఉపయోగపడే ఉత్పత్తులపై అధిక మొత్తంలో కేటాయింపులు చేపట్టినట్టు కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రం చేసిన ఈ ప్రకటనతో అన్నదాతలు లబ్ధిపొందనున్నారు. 
 
అయితే, అన్నదాతలతోపాటు వ్యవసాయ రంగానికి అవసరం అయ్యే ఉత్పత్తుల తయారీ పరిశ్రమలో వున్న శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, కేఎస్‌బీ పంప్స్ లిమిటెడ్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్, వాటర్‌బేస్ లిమిటెడ్, జేకే అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్, పీఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాంటి సంస్థలు సైతం లబ్ధి పొందనుండటం గమనార్హం. 
 
కార్పొ'రేటు' ఆస్పత్రులు : 
జాతీయ ఆరోగ్య సురక్ష భీమా పథకం కింద ప్రతీ పేద కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల భీమా కల్పించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకంతో మొదట లబ్ధి పొందేది నిరుపేదలు అయితే, ఆ లబ్ధిని క్యాష్ చేసుకునేది మాత్రం కార్పోరేట్ ఆస్పత్రులే. 
 
ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు :
మౌళిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి-విస్తరణ, రైల్వే అభివృద్ధిపై దృష్టిసారించనున్నట్టు కేంద్రం స్పష్టంచేసిన నేపథ్యంలో నిర్మాణరంగం, ట్రెయిన్ వ్యాగాన్ తయారీదారులు, ఇంజనీరింగ్ పరిశ్రమలు లాంటి సంస్థలు లాభాల బాటపట్టే అవకాశం వుంది. 
 
ఈ రంగంలో లాభాల బాట పట్టే జాబితాలో లార్సెన్ అండ్ టూబ్రో, హిందూస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఎన్సీసీ లిమిటెడ్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాక్చర్ డెవెలపర్స్ లిమిటెడ్, దిలిప్ బిల్డ్‌కాన్ లిమిటెడ్, టైటాగర్ వ్యాగాన్స్ లిమిటెడ్‌తోపాటు సిమ్‌కో లిమిటెడ్ లాంటి వాణిజ్య సంస్థలు వున్నాయి.
 
కన్సూమర్ కంపెనీలు : 
ఈ రంగంలో అధిక కేటాయింపుల పుణ్యమా అని కన్సూమర్ గూడ్స్ కంపెనీలు అయిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తోపాటు మ్యారికో లిమిటెడ్, హీరో మోటో కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టూబ్రో లాంటి కంపెనీలు లబ్ధి పొందనున్నాయి. 
 
జువెల్లర్స్ :
దేశంలో మొత్తం బంగారం వ్యాపారంలో 60శాతం డిమాండ్ గ్రామీణ ప్రాంతాల నుంచే వుందనేది మార్కెట్ వర్గాలు చెబుతున్న మాట. 2018 కేంద్ర బడ్జెట్ పూర్తిగా గ్రామీణ భారతాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారనే విశ్లేషణల నేపథ్యంలో.. వ్యవసాయం ద్వారా లాభపడిన సామాన్యుల కొనుగోలు శక్తి పెరగడంతో బంగారం అమ్మకాలు కూడా పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
 
విమానాశ్రయాలు :
ప్రాంతీయంగా విమానాశ్రయాల నిర్మాణం, విస్తరణపై దృష్టి సారించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ రంగంలో పెట్టుబడుల ద్వారా మొదటిగా లబ్ధి పొందేది జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లాంటి కంపెనీలు లాభ పడతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
నష్టపోయేవి:
యాపిల్ :
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి స్మార్ట్ ఫోన్లు, వాటి విడిభాగాలు, పరికరాల దిగుమతులపై కస్టమ్స్ సుంకం 15 నంచి 20 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. దీంతో యాపిల్ సంస్థ బాగా నమ్ముకున్న యాపిల్ ఫోన్ల ధరలు పెరగడం, ఫలితంగా ఫోన్ల అమ్మకాలు తగ్గడమో లేక లాభాలు తగ్గడమో జరిగే అవకాశాలు వున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
 
కస్టమ్స్ సుంకాన్ని పెంచడం ద్వారా భారత్‌లోనే స్మార్ట్ ఫోన్స్ తయారీని ప్రోత్సహించడం కేంద్రం ముందు వున్న ఒక లక్ష్యమైతే, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనేది మరో అంచనా.
 
ఫైనాన్షియల్ సెక్టార్ :
బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దీర్ఘకాలపు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధించాలన్న కేంద్రం నిర్ణయం ఫైనాన్స్ రంగంలో వున్న ఐడీఎఫ్‌‌సీ లిమిటెడ్, రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్ లిమిటెడ్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలపై ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
 
డిఫెన్స్ సెక్టార్ :
రక్షణ రంగం సేవల్ని కొనియాడిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. ఆ రంగంలో ఫ్రెండ్లీ పాలసీ కోసం కృషిచేయనున్నట్టు తెలిపారు. అయితే, రక్షణ రంగంలో పెట్టుబడుల దిశగా జైట్లీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో రక్షణ రంగంలో వున్న భారత్ ఫోర్జ్ లాంటి సంస్థలకు ఈసారి పెద్దగా ప్రోత్సాహకాలు లభించే అవకాశం వున్నట్టు కనిపించడం లేదు.
 
వినియోగదారులు : 
ప్రజా ఆరోగ్యం కోసం భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు చేపట్టిన కేంద్రం.. అందుకు అవసరమైన నిధులని సమకూర్చుకునేందుకు ఆరోగ్యం, విద్యా సుంకాన్ని ప్రస్తుతం వున్న 3 శాతం నుంచి 4 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ సుంకం అన్ని వస్తు, సేవలకు వర్తించనున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. దీంతో ఇకపై అన్నివస్తు, సేవల ధరల్లో కొంత పెరుగుదల కనిపించే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు నిపుణులు.
 
క్రిప్టోకరెన్సీ : 
క్రిప్టోకరెన్సీతో జరిపే డిజిటల్ చెల్లింపులకి అనుమతి వుండబోదు అని కేంద్రం చేసిన ప్రకటన, క్రిప్టోకరెన్సీ కలిగి వున్న ధనవంతులు, క్రిప్టోకరెన్సీతో వ్యాపార లావాదేవీలు జరిపే వాణిజ్య సంస్థలు, క్రిప్టోకరెన్సీ ఎక్చేంజ్ కేంద్రాలపై ప్రభావం పడనుంది.
 
ఆర్ధిక లావాదేవీలలో భాగంగా ఎన్‌క్రిప్షన్ పద్ధతిలో డిజిటల్ చెల్లింపులు జరిపే మరో ప్రత్యామ్నాయ మాధ్యమమే ఈ క్రిప్టో కరెన్సీ. ఇటీవల కాలంలో ఈ బిట్‌కాయిన్స్ వినియోగంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఈ బిట్‌కాయిన్స్‌ని నిషేధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కూడా వినిపించింది.

Trending News