ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణదత్ తివారీ (ఎన్.డీ. తివారీ) కన్నుమూశారు. ఢిల్లీ సాకేత్‌లోని మాక్స్ హాస్పిటల్లో గురువారం తివారీ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
అనారోగ్య కారణాల వల్ల ఈ ఏడాది జులైలో ఎన్డీ తివారీ (92) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గత ఏడాది సెప్టెంబరు 20న బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ తివారీ ఆస్పత్రిలో చేరారు.
జనవరి 2017లో ఉత్తరాఖండ్ ఎన్నికలప్పుడు తివారీ భార్య ఉజ్వల, కుమారుడు రోహిత్‌లతో కలిసి బీజేపీలో చేరారు. ఎన్డీ తివారీ ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఓ బలమైన రాజకీయ వేత్తగా ఎదిగారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తివారీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు.
రాజకీయ నేపథ్యం
నారాయణదత్ తివారీ అక్టోబర్ 18, 1925న ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని బాలూటిలో జన్మించారు. 1952లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1963లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 1965లో ఉత్తర్ ప్రదేశ్ మంత్రిగా, చరణ్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా (1979-1980) పనిచేశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, లోక్ సభ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో పరిశ్రమల శాఖ, పెట్రోలియం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్థిక వాణిజ్య శాఖలకు మంత్రిగా పనిచేశారు.
1990 తొలినాళ్లలో పీవీ నరసింహ రావుతో ప్రధాని పదవికి పోటీపడి భంగపడ్డారు. ఆతర్వాత సొంతంగా 1995లో అర్జున్ సింగ్‌తో కలిసి ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ (తివారీ) అనే పార్టీని స్థాపించి.. సోనియా జోక్యంతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. 1996, 1999లో మళ్లీ లోక్‌సభ సభ్యుడయ్యారు.
తివారీ మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 2002 నుండి 2006 వరకు ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేశారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితులయ్యారు. అయితే ఆరోగ్య కారణాల దృష్ట్యా డిసెంబరు 26, 2009న గవర్నర్ పదవికి రాజీనామా సమర్పించారు.
కాగా కొసమెరుపు ఏంటంటే.. ఆయన పుట్టిన తేదీ, మరణించిన తేదీ ఒకటే కావడం గమనార్హం.
Former UP and Uttarakhand CM ND Tiwari passes away at Max Hospital in Saket. #Delhi pic.twitter.com/tavfHc73Bp
— ANI (@ANI) October 18, 2018