పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజే దేశ రాజధానిలో ప్రారంభమవ్వనున్నాయి. ఈ రోజు ఎగువ, దిగువ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని భావించిన సర్కార్, తొలివిడతను జనవరి 29 నుండి ఫిబ్రవరి 9 వరకూ.. అలాగే రెండో విడత సమావేశాలను మార్చి 5వ తేది నుండి ఏప్రిల్ 6వ తేది వరకు నిర్వహించాలని భావించడం గమనార్హం.
ఇటీవలే ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగానే అన్ని పార్టీలను పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. ముఖ్యంగా ఈ సమావేశాలు దిగ్విజయంగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు నైతిక బాధ్యతలను తీసుకొని.. ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని భారత ప్రధాని కోరారు. ప్రతిపక్షలు ఎటువంటి గొడవలు లేకుండా సామరస్య ధోరణిలో అంశాలను లేవనెత్తితే వాటికి సర్కారు సమాధానాలు ఇస్తుందని కూడా ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
కేంద్ర బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక మంత్రి ఆ శాఖ సర్వేను సభ ముందుకు తెస్తారు కాబట్టి.. అదే సభలో పలు వాదనలు, ప్రతివాదనలు జోరుగా జరిగే అవకాశం ఉంది. ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే కావున.. ఆ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్రిపుల్ తలాక్ బిల్లు లాంటి ప్రధాన బిల్లులపై ఈ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు.