బెంగళూరు: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకరినొకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటలోని ఓ లాడ్జ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తాళలేకే ఈ ఐదుగురు కుటుంబసభ్యులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, అసలు కారణం ఏంటనేది మాత్రం దర్యాప్తులోనే తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబసభ్యులు గత కొన్ని రోజులుగా లాడ్జిలోనే ఉంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇద్దరు భార్యభర్తలతోపాటు ఓ నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.