సాధారణంగా ఎక్కడైనా డీజిల్ ధర కన్నా పెట్రోల్ ధరలే అధికంగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ మన తెలుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రమైన ఒడిషాలో మాత్రం సీన్ అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ నిన్న ఆదివారం నాడు లీటర్ పెట్రోల్ ధర రూ.80.57 కాగా లీటర్ డీజిల్ ధర రూ.80.69 గా ఉంది. అంటే పెట్రోల్ కన్నా డీజిల్ ధరే 12 పైసలు అధికం అన్నమాట. ఇదే విషయమై ఉత్కల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ లత్ మాట్లాడుతూ.. ఒడిషాలో ఇలా పెట్రోల్ ధరలకన్నా డీజిల్ ధరలే అధికమవడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇతర అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేసే వ్యాట్ మొత్తం వేర్వేరు ఉండగా ఒడిషాలో మాత్రం రెండింటిపై ఒకేరకంగా 26 శాతం వ్యాట్ వసూలు చేయడమే అందుకు కారణం అని అన్నారు. డీజిల్ ధరలు అధికమైన కారణంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో డీజిల్ అమ్మకాలు పడిపోయినట్టు సంజయ్ లత్ స్పష్టంచేశారు.
ఇదిలావుంటే, ఒడిషాలో డీజిల్ ధరలు పెరగడానికి కేంద్రం అవలంభిస్తున్న చెత్త విధానాలే కారణం అని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎస్బీ బెహరా ఆరోపించారు. ఈ ధరలు ఇలాగే పెరుగూతూపోతే నిత్యావసర సరకుల ధరలు సైతం కొండెక్కి కూర్చుంటాయని బెహరా ఆందోళన వ్యక్తంచేశారు. ఒడిషాలో డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్రం వైఫల్యాలే కారణం అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత ఆర్య జ్ఞానేంద్ర విమర్శించారు.
కేంద్రంపై ఒడిషాలోని అధికార పార్టీ బిజు జనతా దళ్, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కలిసి చేస్తోన్న విమర్శలపై ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ హరిచంద్రన్ మాట్లాడుతూ.. "ఒడిషా ఆర్థిక శాఖ మంత్రి ఎస్బీ బెహరా బాధ్యతతో వ్యవహరిస్తే బాగుంటుంది" అని హితవు పలికారు. ఇంధనం ధరల పెరుగుదలకు ఎవరు కారణమో దేశం మొత్తానికి తెలుసునని, ఇప్పటికే 13 రాష్ట్రాలు ఇంధనం ధరలపై వ్యాట్‌ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా.. ఒడిషా సర్కార్ మాత్రం ఇంకా ఆలస్యం చేస్తూ ఆ నేరాన్ని కేంద్రంపై తోసేస్తోందని హరిచంద్రన్ మండిపడ్డారు.