భారీగా డబ్బులు ఉంటాయనే ప్లాన్‌తో మాస్కులు ధరించి మరీ ఓ బిర్యాని రెస్టారెంట్లోకి ప్రవేశించారు ఇద్దరు దొంగలు. ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి చోరీకి వచ్చిన ఇద్దరు దొంగలకు ఖాళీగా ఉన్న నగదు పెట్టె దర్శనం ఇచ్చింది. దీంతో పిచ్చెక్కిన దొంగలకు ఏం చేయాలో అర్థం కాక అక్కడ రెస్టారెంట్లో ఆ రోజు మిగిలి ఉన్న బిర్యానిని పొట్టపగిలేలా తిని, మిగతాదంతా హోటల్ నిండా వెదజల్లారు. డబ్బులు దొరకలేదనే ఆగ్రహంతో రెస్టారెంట్లో వస్తువులన్నీ చిందరవందర చేశారు. కౌంటర్లో కనిపించిన ల్యాప్‌టాప్ తీసుకుని దొరికిందే చాలనుకుని వెళ్లిపోయారు. ఢిల్లీలోని సరితా విహార్‌లో ఉన్న ఓ రెస్టారెంట్లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉదయం రెస్టారెంట్‌కి వచ్చిన యజమాని హోటల్లో చోరీ జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు దొంగలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే, దొంగలు తాము చోరీ చేసిన ల్యాప్ టాప్ అమ్మేందుకు మార్కెట్‌కి వస్తారని భావించిన పోలీసులు సరితా విహార్ పార్క్ వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అనుకున్నట్టే అదే రోజున ఆ ల్యాప్ టాప్ అమ్మేందుకు వచ్చి పోలీసులకు చిక్కారు ఆ ఇద్దరు దొంగలు. ఆ హోటల్‌కి రెగ్యులర్ కస్టమర్స్ అయిన రాజు సింగ్ (19), బాబీ రాజు (22) పోలీసుల విచారణలో తమ నేరాన్ని అంగీకరించారు. ఆ విధంగా బిర్యాని రెస్టారెంట్లో రాత్రి జరిగిన చోరీ కేసు తెల్లవారి మధ్యాహ్నానికల్లా పరిష్కారమైంది.