అత్యున్నత పోస్టులో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి నియామకం

పౌర విమానయాన శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపడంతో విమానయాన సంస్థ ఎయిరిండియాకు స్వతంత్ర హోదా డైరెక్టరుగా బీజేపీ నేత, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి నియమతులు అయ్యారు

Last Updated : Sep 20, 2018, 10:57 PM IST
అత్యున్నత పోస్టులో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి నియామకం

పౌర విమానయాన శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపడంతో విమానయాన సంస్థ ఎయిరిండియాకు స్వతంత్ర హోదా డైరెక్టరుగా బీజేపీ నేత, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి నియమితులు అయ్యారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆమె సేవలు అందించనున్నారు. డీపీటీఓ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. 2004లో 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికైన పురందేశ్వరి అప్పుడు న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.

అలాగే 15వ లోక్ సభకు కూడా రెండవసారి ఎన్నికయి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2015లో బీజేపీ మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా కూడా దగ్గుబాటి పురందేశ్వరి పనిచేశారు. 2004 సంవత్సరానికి గాను ఏషియన్ ఏజ్ పత్రిక పురందేశ్వరిని ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో సత్కరించింది. ఈమెను పలువురు దక్షిణాది సుష్మా స్వరాజ్ అని కూడా పిలుస్తారు. 

ప్రస్తుతం ఎయిర్ ఇండియాకి నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్‌తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా కూడా ఉన్నారు. అలాగే ఇన్వెస్టర్ బ్యాంకర్ సయ్యద్ జాఫర్ ఇస్లామ్, పవన్ హన్స్ హెలికాప్టర్స్ అధినేత రవీంద్ర కుమార్ త్యాగి కూడా స్వతంత్ర డైరెక్టరులుగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకి ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టరుగా ప్రదీప్ సింగ్ ఖరోలా సేవలు అందిస్తున్నారు.

Trending News