నరేంద్ర మోదీ ఇలాక నుంచే లోక్ సభకు సై అంటున్న కాంగ్రెస్

58 ఏళ్ల తర్వాత గుజరాత్‌లో సీడబ్లూసీ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.

Last Updated : Mar 12, 2019, 08:15 PM IST
నరేంద్ర మోదీ ఇలాక నుంచే లోక్ సభకు సై అంటున్న కాంగ్రెస్

గాంధీనగర్: లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్స్, ప్రణాళికలతో బిజీ అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే రాజకీయ పార్టీలు బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నప్పటికీ.. షెడ్యూల్ విడుదలయ్యాకా తొలిసారి నిర్వహించే సభలతోనే ఎన్నికల ప్రచారం వాతావరణం మరింత వేడెక్కనుంది. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా నరేంద్ర మోదీ సర్కార్‌పై పైచేయి సాధించాలనే కసితో వున్న కాంగ్రెస్ పార్టీ... తమ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచే ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కావడంతోపాటు గాంధీనగర్ జిల్లాలో ''జై జవాన్.. జై కిసాన్'' అనే నినాదంతో ఓ పబ్లిక్ ర్యాలీ సైతం నిర్వహించనుంది. 

క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఈ పబ్లిక్ ర్యాలీలో పాల్గొనే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గాంధీనగర్‌లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో నేడు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ప్రచారంలో ప్రస్తావించాల్సిన అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి. 

ఇవాళ గాంధీనగర్‌లో జరగనున్న సీడబ్లూసీ భేటీకి ఓ ప్రాధాన్యత వుంది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో 1961లో సీడబ్లూసీ చివరిసారిగా భేటీ అయింది. ఆ తర్వాత మళ్లీ 58 ఏళ్లకు సీడబ్లూసీ సమావేశం గుజరాత్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారి.

Trending News