తమిళనాట ఎన్నికల వేడి ప్రారంభమైపోయింది. అధికార పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీలక భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
తమిళనా ( Tamil nadu ) లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. జయలలిత మరణానంతరం నాటకీయ పరిణామాల మధ్య సీఎం కుర్చీను అధిరోహించిన పళనిస్వామి పార్టీలో పట్టు సాధించారన్పిస్తోంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్సెస్ పళని స్వామి రేసులో పళనిస్వామి పై చేయి సాధించారు. అంతేకాదు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పళనిస్వామి పేరును స్వయంగా పన్నీర్ సెల్వమే ( Pannerselvam ) ప్రతిపాదించడం విశేషం.
చెన్నైలోని ఏఐఏడీఎంకే( AIADMK ) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీలకమైన భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయంతో తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రస్తుత సీఎం పళనిస్వామికే మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ఎంపిక చేశారు. సీఎం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ( CM palanisamy ) పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను మాత్రం పన్నీర్ సెల్వంకు అప్పగించారు.
దీనికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు సంతకాలు చేశారు. మరోవైపు రెండువైపుల్నించి 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు. వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో పార్టీ తరపున సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటి వరకు భారీ ఎత్తున వివాదం నడిచింది. ఓ దశలో నేనంటే నేనే అంటూ పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు పరోక్షంగా ప్రకటనలిచ్చుకున్నారు. ఇప్పుడు ఈ తాజా ప్రకటనతో వివాదానికి తెరపడింది.