తండ్రి పేరు లేకున్నా ఓకే.. పాన్‌కార్డ్ నిబంధనల్లో మార్పులు!

ఒంటరి తల్లుల పిల్లలు తమ తండ్రి పేరును పేర్కొనకుండా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేలా నిబంధనలు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం.

Last Updated : Jul 11, 2018, 05:13 PM IST
తండ్రి పేరు లేకున్నా ఓకే.. పాన్‌కార్డ్ నిబంధనల్లో మార్పులు!

ఒంటరి తల్లుల పిల్లలు తమ తండ్రి పేరును పేర్కొనకుండా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేలా నిబంధనలు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు నిబంధనలను మార్చాలని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ(డబ్ల్యూసీడీ) ఆర్థికశాఖకు ప్రతిపాదించింది.  డబ్ల్యూసీడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా .. జాతీయ మహిళా కమిషన్ స్వాగతించింది.

జీ బిజినెస్ రిపోర్టు ప్రకారం, డబ్ల్యూసీడీ మంత్రి మేనకా గాంధీ ఈ విషయంపై తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌కు జులై 6న లేఖను రాశారని తెలిసింది. తండ్రి పేరు నమోదు చేయకుండా ఒంటరిగా ఉన్న మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు లేదా బిడ్డలను దత్తత తీసుకున్న ఒంటరి తల్లుల పిల్లలు పాన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకొనేలా అవకాశాన్ని కల్పించాలని ఆమె కోరారు. ఒంటరి తల్లుల విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, మాజీ భర్తల పేర్లను ప్రభుత్వ దరఖాస్తుల్లో పేర్కొనకుండా అవకాశం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

మహిళల్లో సాధికారికత కల్పించడానికి ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుందని, ఇది చాలా మంచి నిర్ణయమని, దీన్నీ మేము స్వాగతిస్తున్నట్లు  జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ అన్నారు. ఈ నిబంధనను అమలు చేస్తే పాన్‌ కార్డు పొందేందుకు ఇబ్బందులు పడుతున్న చాలా మంది పిల్లలకు పరిష్కారం దొరుకుతుందని సామాజిక, మహిళా హక్కుల కార్యకర్తలు అన్నారు.

Trending News