ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరాంజి దాస్ టాండన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు సోమవారం రిహార్సల్లో పాల్గొన్న ఆయన.. ఆ తరువాత గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మరణించినట్లు కుటుంబసభ్యులు ధృవీకరించారు. రాజ్‌భవన్ వర్గాల ప్రకారం, టాండన్ గతకొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
టాండన్ జన్ సంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తర్వాత జన్ సంఘ్ ఒక రాజకీయ పార్టీ- బీజేపీగా అవతరించింది. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా టాండన్ జులై 2014 నుంచి పనిచేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అనేక పదవులను చేపట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జైలుకు కూడా వెళ్లారు.