'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఐతే లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ క్రమంలో కొన్ని ఆంక్షలతో పారిశ్రామికోత్పత్తి పునః ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
లాక్ డౌన్ తర్వాత హాట్ స్పాట్ కాని ప్రాంతాల్లో పరిశ్రమల పునః ప్రారంభానికి కేంద్రం ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది. ఐతే లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ పరిశ్రమలు మూతవేసి ఉన్నాయి. కాబట్టి పునః ప్రారంభానికి కొన్ని మార్గదర్శకాల జాబితాను కేంద్ర హోం శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ శాఖ కలిసి విడుదల చేశాయి. ప్రమాదకరమైన రసాయనాల ఉత్పత్తి కర్మాగారాల్లో పైప్ లైన్లు, వాల్వులు ఇతర వస్తువులపై రసాయనాలు పేరుకుపోయి ఉండవచ్చు. ఈ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతే కాదు ఇటీవలే విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదం జరిగింది. కాబట్టి కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు.
కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవిగో..!!
1. పరిశ్రమ పునః ప్రారంభించిన తర్వాత మొదటి వారాన్ని పరీక్షా సమయంగా చూడాలి. అలాగే రక్షణకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలి. ఎక్కువ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకోవద్దు.
2. కొత్త ధ్వనులు, కొత్త వాసనలపై దృష్టి సారించాలి. వైర్లు ఏమైనా బయటకు కనిపిస్తున్నాయా చెక్ చేయాలి. లీకులు, పొగ రావడం లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా పరిశీలించాలి. అసాధారణ పరిస్థితులను పసిగట్టాలి. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే పరిశ్రమ మూసివేయాలి.
3. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమల వేళలు క్రమపద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. 24 గంటలు నడిచే పరిశ్రమలకు ఇది వర్తించదు.
4. పరిశ్రమలోని అన్ని పరికరాలను క్రమపద్ధతిలో పరిశీలించాలి.
5. పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించడాని ఎలాంటి అడ్డంకులు ఎదురైనా జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి. రక్షణకు సంబంధించిన సూచనలు తీసుకోవచ్చు.
అలాగే ముడి సరుకులు, ముడి సరుకుల నిల్వ, తయారీకి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు కూడా కేంద్రం విడుదల చేసింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..