జర్నలిస్టుల కదలికలపై కేంద్రం నిఘా: జర్నలిస్టు సంఘాల ఆరోపణ

నకిలీ వార్తలు రాసే విలేకర్లు శిక్షార్హులని చెప్పి వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కేంద్రం.

Last Updated : Apr 8, 2018, 05:38 PM IST
జర్నలిస్టుల కదలికలపై కేంద్రం నిఘా: జర్నలిస్టు సంఘాల ఆరోపణ

నకిలీ వార్తలు రాసే విలేకర్లు శిక్షార్హులని చెప్పి వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కేంద్రం. అయితే కేంద్రం జర్నలిస్టుల కదలికలపై ఓ కన్ను వేసి ఉంచాలనే ఆలోచన చేస్తోందని పాత్రికేయుల జాతీయ కూటమి(ఎన్ఏజే) ఆరోపించింది.

జర్నలిస్టులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డులు జారీ చేయాలనే ఆలోచన సరికాదని పేర్కొంది. ఏదో ఒక రూపంలో మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలించడం పాత్రికేయ వృత్తిని అవమానించడమే అవుతుందని మండిపడింది. ప్రభుత్వ చర్యలను ఎండగట్టేందుకు వచ్చేవారంలో దేశంలోని జర్నలిస్టులంతా 'విజిలెన్స్ డే' పాటించాలని ఎన్ఏజే ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం చేపట్టాలని ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ, ఎన్ఏజే తెలంగాణ శాఖ, టీబీజేఏలు నిర్ణయించాయి. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛ హరించడానికి బదులు స్వేచ్ఛగా సమాచారం అందజేసేందుకు వీలైన పరిస్థితులు కల్పించాలని పాత్రికేయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా.. నిర్ధారణ లేకుండా వీటిని రాసే జర్నలిస్టుల గుర్తింపును (అక్రిడిటేషన్‌) శాశ్వతంగా రద్దు చేస్తామని గతవారంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. దాంతో ఫేక్ న్యూస్ ప్రచురించిన/ప్రసారం చేసినట్లు రుజువైతే సంబంధిత విలేకరి గుర్తింపును తొలి ఉల్లంఘన కింద ఆరు నెలల పాటు రద్దు  చేస్తారు. రెండోసారీ అదే పని చేస్తే సంవత్సరం పాటు రద్దు చేస్తారు. మూడోసారీ తప్పు చేస్తే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలియజేసింది.

అయితే ప్రకటన వెలువడిన ఆరోజే  కేంద్రం వెనక్కి తగ్గింది. ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఇది నిజమైన వార్తలు రాసే జర్నలిస్టులను నియంత్రించేలా ఉందని సర్వత్రా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. 'ఫేక్ వార్త' అని ఎవరు, ఎలా నిర్థారించగలరు? అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అహ్మద్ పటేల్ సహా విపక్షాలు, మీడియా, నెటిజన్ల నుంచి ప్రశ్నలు రావడంతో.. 'దీనిపై అంతా కలిసి చర్చిద్దాం ప్రస్తుతానికి పక్కనబెడుతున్నాం' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

Trending News