కర్ణాటకను దోచుకున్నవారికే బీజేపీ మద్దతిస్తోంది: కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు

కర్ణాటక కాంగ్రెస్ మంగళవారం భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

Last Updated : Apr 25, 2018, 12:01 PM IST
కర్ణాటకను దోచుకున్నవారికే బీజేపీ మద్దతిస్తోంది: కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు

కర్ణాటక కాంగ్రెస్ మంగళవారం భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మైనింగ్ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థనరెడ్డి సోదరులకి ఆ పార్టీ టిక్కెట్లు ఇచ్చిన క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. బీజేపీ నేతలు మైనింగ్ మాఫియా చేసిన సోదరులకు పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారని.. బళ్లారి రెడ్డి ముఠాకి కాపు గాస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.

గాలి జనార్థనరెడ్డి సోదరులు కరుణాకరరెడ్డితో పాటు సోమశేఖరరెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం పట్ల తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మోడీఫైడ్ రెడ్డి బ్రదర్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో బీజేపీ వ్యతిరేక పోస్టులను కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. బీజేపీకి పరివర్తన రావాల్సిన అవసరం ఉందని.. దొంగలకు సీట్లు కట్టబెట్టడం ఏమిటని బహిరంగంగానే విమర్శలు చేసింది. 

టైమ్స్ నౌ, వీఎంఆర్ సర్వే లెక్కల ప్రకారం కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీ పోరాటం జరిగే అవకాశం ఉందని తేలింది. బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బి ఎస్ ఎడ్యూరప్పని గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కుమారుడు విజయేంద్రతోపాటు, మద్దతుదారు శోభా కరాంద్లజేలకు సోమవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ బీజేపీ చోటు కల్పించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అలాగే ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్‌ అధికారి రేవణ్ణ సిద్దయ్యకు వరుణ నుంచి బీ–ఫామ్‌ ఇచ్చే అవకాశముందనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఇక కర్ణాటకలో జేడీఎస్ పార్టీ విషయానికి వస్తే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదని ఇప్పటికే ఆ పార్టీ నేత హెచ్ డి దేవెగౌడ స్పష్టం చేశారు. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. 

Trending News