దక్షిణ భారతదేశానికి ద్వారం తెరుచుకుంది. 'గేట్ వే ఆఫ్ సౌత్' గా భావిస్తున్న కర్ణాటకలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులేస్తోంది. దీంతో బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సహా ఇతర చోట్ల సంబరాలు మొదలయ్యాయి. అటు దీనిపై స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్.. దక్షిణాదిన తమకు ద్వారాలు తెరుచుకున్నాయని, ఇక దక్షిణ భారతదేశంలోని మిగితా రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో మోదీ-గాలి సోదరుల మ్యాజిక్ పనిచేసింది. దీంతో ఏ పార్టీ అవసరం లేకుండానే సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 224 స్థానాల్లో 222 చోట్ల జరిగిన ఎన్నికల్లో.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113 సాధించేలా ఆధిక్యంలో ఉంది. అధికారంలోని కాంగ్రెస్ గట్టి పోటీని కూడా ఇవ్వలేక 60కి పైగా స్థానాల్లోనే ఆధిక్యంలో ఉండగా ఊహించని విధంగా దాదాపు 50 స్థానాల్లో జేడీఎస్ సత్తా చాటుతోంది. కాగా కర్ణాటకలో హంగ్ అంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని వాస్తవ ఫలితాలు తేల్చేశాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ హవా కాంగ్రెస్ ఆశలకు గండికొట్టిందని చెప్పవచ్చు.