పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సోమవారం (సెప్టెంబర్ 10) కాంగ్రెస్ పార్టీ తలపెట్టనున్నభారత్ బంద్ ప్రభావం బ్యాంకులపై ఉండదని అధికారులు తెలిపారు. రెండో శనివారం, ఆదివారాల సెలవు దినాల తర్వాత సోమవారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. రెండు రోజుల సెలవు కారణంగా బ్యాంకుల మూసివేతతో ఖాతాదారుల పనులు చాలావరకు పెండింగ్ లో ఉండిపోయాయన్నారు. సోమవారం బ్యాంకులన్నీ యథావిధిగానే పనిచేస్తాయని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం పేర్కొంది.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సెప్టెంబరు 10న దేశవ్యాప్త బంద్ నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చమురు ధరల పెరుగుదల తమ చేతుల్లో లేదని శనివారం కేంద్రం తెలిపింది. అమెరికా డాలర్‌తో రూపాయి విలువ తగ్గడం సహా అంతర్జాతీయ పరిణామాలే ఈ పరిస్థితికి కారణమని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.